తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజా ప్రయోజనాలపై చర్చించాల్సిన కేబినెట్ సమావేశాల్ని చంద్రబాబు ప్రహసనంగా మార్చేస్తున్నారని, ఇందులో ఆయన స్వప్రయోజనాలు తప్ప రాష్ట్రంలో అమలు చేయని పథకాలపై కానీ, వరుస హత్యలపై కానీ చర్చించకపోవడమే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో సోషల్ మీడియా ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా నిత్యం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు వైయస్ఆర్‌సీపీపై వ్యక్తిత్వ హననం చేస్తూ, ఇప్పుడు తిరిగి మాపైనే కేసులు పెడతామని కేబినెట్లో చెప్పడం చంద్రబాబుకు సిగ్గుచేటని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేబినెట్ సమావేశాలను దుర్వినియోగం చేయకుండా, ప్రజా సంక్షేమంపై నిర్ణయాలు తీసుకోవడానికి వినియోగించుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు, సీఎం చంద్రబాబుకు హితవు చెప్పారు. ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే..: స్వప్రయోజనాల కోసమే కేబినెట్ భేటీలు: పోర్టులు, భూములు తన సొంత వారికి కట్టబెట్టడానికి చంద్రబాబు కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నట్లుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టినట్లు లేదు. కేబినెట్లో సీఎంతో సహా 25 మంది మంత్రులుంటే అందులో ఐదుగురు గైర్హాజరు అయ్యారు. ఎంత నాన్ సీరియస్ గా కేబినెట్ మీటింగ్స్ జరుగుతున్నాయో దీన్ని బట్టి అర్దమవుతోంది. కేబినెట్ మీటింగ్ అంటే చంద్రబాబు ఇచ్చిన హామీల్ని ఈసారి అయినా నెరవేరుస్తారని అనుకుంటాం. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భతి, కొత్త పెన్షన్లు ఇస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. పోర్టులు, భూములపై ఆశలు పెట్టుకున్న వారికి మాత్రమే కేబినెట్ సమావేశాలు సంతోషం కలిగిస్తున్నాయి. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, రాజకీయ కక్షలు ఎలా తీర్చుకోవాలని కేబినెట్లో ఆలోచిస్తున్నారు. డీజీపీ గారు సోషల్ మీడియాపై సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు. సోషల్ మీడియాతోనే ఈ దేశానికి ప్రమాదం అనుకుంటున్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద ఓ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టారంట. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేసే వారిని అరికట్టేస్తామంటున్న చంద్రబాబు.. తన కన్నా ప్రత్యర్థుల్ని వ్యక్తిత్వ హననం చేసేవారు ఎవరున్నారో చెప్పాలి. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టి చంద్రబాబు వీడియోలు కూడా చేస్తున్నారు. వ్యంగంగా, బూతులు మాట్లాడిస్తూ ఆనందపడుతున్నారు. ఏఐ వాడి మరీ మా వీడియోలు పెడుతున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే, అవన్నీ వదిలేసి మాపై వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న అనైతిక అంశాల మీద మేం ఇప్పటికే కేసులు కూడా పెట్టించాం. వీటిపై చర్యలు తీసుకోకుండా తిరిగి మాపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తోందెవరు?: చంద్రబాబు అధికారంలోకి రాగానే సోషల్ మీడియాలో మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పటికే మా పార్టీ నాయకులతో పాటు జర్నలిస్టులపై 1549 సోషల్ మీడియా కేసులు పెట్టారు. ఇందులో 1044 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా కోసం టాస్క్ ఫోర్స్ కూడా వేశారంట. సోషల్ మీడియా అంటే అంత భయమెందుకు ? 70 శాతం రెగ్యులర్ మీడియా అంతా మీ వాళ్లే. అందుకే సోషల్ మీడియాలో వాస్తవాలు బయటికి వస్తాయని భయపడుతున్నారు. తప్పుడు కేసులు కూడా అందులో భాగమే. కష్ణలంకలో గాదె సాయికష్ణను అతి దారుణంగా లాకప్ లో చంపేస్తే కూతవేటు దూరంలో ఉన్న చంద్రబాబు, డీజీపీ ఏం చేశారు? కోర్టులకు వెళ్లి హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తే అప్పుడు అతను చనిపోయాడని ఒప్పుకున్నారు. క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ వీడియో ఆధారం ఇచ్చాడు. మాల గంగమ్మ, కళావతమ్మ వంటి వారు కూడా చనిపోతే వాటి మీద కేబినెట్లో చర్చించరు. ఈ రెండేళ్లలో టీడీపీ వాళ్లు వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద దాడులు బహిరంగంగానే చేశారు. వ్యతిరేకంగా మాట్లాడితే టీడీపీ వాళ్లు వాళ్ల సొంత పార్టీ వారిపైనే దాడులకు దిగారు. ఒక్కరిని అయినా అరెస్టు చేశారా చెప్పాలి. ఇవన్నీ వదిలేసి డీజీపీ సోషల్ మీడియా మీద ప్రజంటేషన్లు ఇస్తున్నారు. మేం పెనుమాక వెళ్తుంటే అడ్డుకుని దాడి చేస్తూ, మధ్యలో కానిస్టేబుల్ పై రాయి వేస్తే 14 కుట్లు పడ్డాయి. దానిపై మాత్రం కేసు పెట్టరు. ఆ రాయి విసిరిన వ్యక్తి స్పష్టంగా కనిపిస్తున్నాడు. అయనపై కేసు పెడితే లోకేష్ ఒప్పుకోడు. ఎంత సిగ్గుమాలిన విషయం ఇది. పోలీసు కానిస్టేబుల్ తలపగిలి, ప్రాణాపాయ స్దితి నుంచి బయటపెడితే దానిపై కేసు పెట్టరు. సోషల్ మీడియా కేసుల మీద మాత్రం యాక్షన్ తీసుకోరు. మా మీద మాత్రం ట్రోలింగ్ చేస్తారు. మీ డబ్బులు ఖర్చుపెట్టుకోవడమే తప్ప వాటికి ఎవరూ భయపడరు. దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టి తిట్టిస్తారు, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం చేస్తే కార్యక్రమాలు చేస్తారు. సాక్ష్యాత్తూ చంద్రబాబే వాటిలో ముందుంటారు. కేబినెట్లోనూ డైవర్షన్ పాలిటిక్స్ వదలని చంద్రబాబు: కేబినెట్లో వైయస్ఆర్‌సీపీ వాళ్లు మిమ్మల్ని రెచ్చగొడతారు, మీరేం మాట్లాడకండి అని చంద్రబాబు అంటున్నారు. అంతా ఒట్టిదే, నాటకాలు తప్ప ఏమీ కాదు. రకరకాల డైవర్షన్ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనుకుంటున్నారు. దమ్ముంటే ప్రభుత్వం ఎలాంటి హత్యలు చేసిందో విచారణకు సిద్దమా అంటే ముందుకు రారు, సీబీఐ ఎంక్వైరీ వేయమంటే వారు, కానీ అన్నీ కలగాపులగం చేయమంటే మాత్రం చేస్తారు. పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా కేసులు పెట్టరు. వాళ్లు మాత్రం ఆధారాలు లేకుండా ఫిర్యాదుల చేసినా అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. పోలీసుల్ని చూపించి భయపెట్టాలని చూస్తూ ప్రభుత్వం రోజురోజుకూ దిగజారిపోతోంది. శాంతి భద్రతలు చూస్తే ఈ రాష్ట్రాన్ని భగవంతుడే కాపాడాలనేలా ఉంది. ప్రజలు, మేథావులు దీనిపై ఆలోచించాలి. ఉత్తుత్తి కేబినెట్ మీటింగ్ లు పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వ్యక్తిత్వ హననాలు మానుకోవాలి. ఏది జరిగినా ప్రభుత్వం దూకుడుగా ప్రవర్తిస్తే ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని, పోలీసుల్ని కట్టిడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మానేసి కేబినెట్ లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా మీటింగ్స్ కు రాడు. అది చంద్రబాబు, ఆయనా తేల్చుకోవాలి. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు ఆయనకు నచ్చక రావడం లేదేమో ? కేబినెట్ సమావేశాల్ని ఉపముఖ్యమంత్రి చాలా సార్లు ఎగ్గొట్టారు. దీనిపై పుకార్లు, రకరకాల అనుమానాలు ఉన్నాయి. వాస్తవాలు పవన్ కళ్యాణే చెప్పాలి. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోంది ఎవరు ? చంద్రబాబు వర్గాల్ని రెచ్చగొట్టి మా మీద పడి విమర్శలు చేస్తున్నారు. బాధితుల తరఫున మేం పోరాడతాం, వాళ్లు మా పార్టీ వారు కాకపోయినా అండగా ఉంటాం, రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వాన్ని నడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నందుకు కూడా కేసు పెట్టారంట. చట్నీ లేని ఉప్మా చట్టమే అది. దాన్ని ఉప్మా చట్టం అంటే మళ్లీ కేసు పెడతారా? చంద్రబాబు, లోకేష్ పెట్టమంటేనే రావణ్ పై ఈ చట్టం కింద కేసు పెట్టారు. రావణ్ మాట్లాడిన రోజే పెట్టి ఉంటే అప్పుడు నిజమని నమ్మే వాళ్లం. కానీ ఇప్పుడు రావణ్ కు వరుసగా బెయిల్స్ వస్తుంటే ఉపా చట్టాన్ని ప్రయోగించారు. రావణ్ కూ, మాకూ ఎలాంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్ పోర్టులో కనిపిస్తే రావణ్ టీమ్ లో ఉన్న ఓ యువతి సాయం అడిగితే న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ పెట్టే అక్రమ కేసుల్లో బాధితుల వైపు న్యాయం ఉందని భావిస్తే న్యాయ సహాయం అందిస్తామని అంబటి రాంబాబు చెప్పారు.