బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం

మాజీ డిప్యూటీ స్పీక‌ర్‌ కోన రఘుపతి ఫైర్ 

బాప‌ట్ల‌: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ డిప్యూటీ స్పీక‌ర్‌ కోన రఘుపతి విమర్శించారు. రూ.42 కోట్లతో పునాదుల నిర్మాణం వరకు పనులు పూర్తిచేసిన ప్రాజెక్టును గాలికొదిలేయడంతో పునాదుల్లోని ఇనుప రాడ్లను సైతం దొంగలు కత్తిరించి తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీకి వెంటనే భద్రత కల్పించి, పనులను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్ర‌వారం బాపట్లలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని మాజీ ఉపసభాపతి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు కోన రఘుపతి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

వైయస్ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీ పునాదుల నిర్మాణం వరకు రూ.42 కోట్లు వెచ్చించి పనులను ముందుకు తీసుకెళ్లిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో పునాదుల్లో ఉన్న ఇనుప రాడ్లను సైతం దొంగలు కత్తిరించి తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రారంభించిన మెడికల్ కాలేజీలు ప్రస్తుతం రక్షణ లేక దొంగల బారిన పడటం అత్యంత బాధాకరమని కోన రఘుపతి అన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం విచారకరమని చెప్పారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ ప్రాంగణానికి వెంటనే భద్రతా సిబ్బందిని నియమించి, నిర్మాణ సామగ్రిని రక్షించడంతో పాటు పనులను తిరిగి ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
 

Back to Top