మచిలీపట్నం: డీజీపీని పక్కనపెట్టి కిందిస్థాయి పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబు నేరుగా సమీక్షలు నిర్వహించి వారితో భజన చేయించుకోవడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని వాడుకునే కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మచిలీపట్నంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన పేర్ని నాని రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, టీడీపీ నేతల తప్పుడు ఆరోపణలపై మండిపడ్డారు. రాజమండ్రిలో మహిళా డాక్టర్‌ను వెన్నుపోటు పార్టీ కార్యకర్తలు దారుణంగా చంపేసినా, గంజాయి బ్యాచ్ పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నా పట్టించుకోని హోంమంత్రి అనిత, పవన్ కళ్యాణ్‌ల బాధ్యతారాహిత్యాన్ని ఆయన ఎండగట్టారు. అమరావతి పేరుతో ప్రమోషన్ల హడావుడి చేస్తూ రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారే తప్ప, సాగునీరు లేక అల్లాడుతున్న కృష్ణా డెల్టా రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టడంలేదని విమర్శించారు. ఇక తనపై, తన కుటుంబంపై 'పిట్టల దొర' బోండా ఉమ చేసిన రూ. 50 కోట్ల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాము ఆ డబ్బు ఇచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ గానీ, కనీసం ఒక్క ఫోటో గానీ ఉంటే బయటపెట్టాలని, దమ్ముంటే ఈడీతో కేసు పెట్టి తమను జైలుకు పంపాలని నేరుగా సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడో లేడో తెలియని పరిస్థితి ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడూ చేయని విపరీత చేష్టలకు సీఎం చంద్రబాబు తెరలేపారు. తనకు అవసరమా? ఇది తప్పా, ఒప్పా? అనే విచక్షణ కోల్పోయి, ఏకంగా రాష్ట్ర డీజీపీని పక్కనపెట్టి 1100 మంది ఎస్‌హెచ్‌ఓలు, సీఐలు, డీఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ ఉన్నాడో లేడో, ఆయన ఫోన్ కట్టేసి వెళ్ళిపోయాడో కూడా తెలియని పరిస్థితి. ఇలా కిందిస్థాయి అధికారులతో సీఎం నేరుగా ఎందుకు మాట్లాడటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. ఆయనకు ఎల్లో మీడియా, తన పార్టీ ఎమ్మెల్యేలు చేసే భజన కిక్కు చాలడం లేదు. ఇప్పుడు ఏకంగా కాకీ బట్టలు వేసుకున్న పోలీసులతో "ఆహా.. ఓహో.. మీ ధైర్యసాహసాలు అద్భుతం సార్" అని పొగడ్తలు, భజన చేయించుకోవడానికి ఈ కాన్ఫరెన్స్ పెట్టారు. మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని, ఆస్తులను లాక్కోవడాన్ని చూసి ఓ సీఐ 'మీ ధైర్యసాహసాలకు అబ్బురపడ్డాం' అని భజన చేయడం సిగ్గుచేటు. రెండో కారణం.. రేపు రాబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పోలీసులను అడ్డగోలుగా వాడుకుని అక్రమాలకు పాల్పడటానికే ఈ కుట్ర. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా భ్రష్టు పట్టించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? పవన్, అనితలు ఏమయ్యారు? రాష్ట్రంలో శాంతిభద్రతలు సర్వనాశనం అయ్యాయి. ఓవైపు లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసి, కొందరు ఐపీఎస్ అధికారులు మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఐదేళ్లు జైలు శిక్ష, ఉరిశిక్షలు వేయాలని చట్టాలు మార్చమంటూ వింత వాదనలు చేస్తున్నారు. రాజమండ్రిలో ముక్కుపచ్చలారని ఓ మహిళా డాక్టర్‌ను ఇద్దరు తాగుబోతు టీడీపీ కార్యకర్తలు కారుతో గుద్ది, తొక్కించి దారుణంగా చంపేస్తే.. పోలీసులు దాన్ని ఓ యాక్సిడెంట్ కేసుగా నీరుగార్చారు. గంజాయి బ్యాచ్ రెచ్చిపోయి పోలీసుల కాలర్ పట్టుకుని కత్తులతో పొడవబోతున్నా దిక్కులేదు. మహిళలకు రక్షణ కల్పించే దిశా చట్టాన్ని ఎత్తేశారు. ఇంత దారుణాలు జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏమయ్యారు? కనీసం స్పందించారా? ఆ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్లారా? ఇక ఆడపిల్లల రక్షణపై వందల మీటింగుల్లో ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కేవలం ట్వీట్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆయనకు తెలిసిన వాళ్లకు, ఆయనకు కావాల్సిన వాళ్లకు అన్యాయం జరిగితే తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబులు స్పందించరా? ఓట్ల కోసమే వీరికి ఆడపిల్లలు గుర్తొస్తారా? అమరావతి బద్దలై పోయిందని బిల్డప్.. ఇక అమరావతి ఏదో బద్దలైపోయింది, ఎరిగిపోతోంది అని చెప్పి ఛానెల్స్‌కు డబ్బులిచ్చి మరీ ప్రమోషన్లు చేయించుకుంటున్నారు. 2015లో టెండర్లు పిలిచి, 2018కి స్లాబులు వేసిన ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు.. ఆరేళ్లకు గోడలు, కిటికీలు పెట్టి ఏదో గొప్ప అద్భుతం చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు. అక్కడున్న 3,500 క్వార్టర్స్‌లో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఉంటాడా? అందరూ హోటల్స్ లో ఉంటూ, అక్కడ తమ గన్ మెన్లను, డ్రైవర్లను పడుకోబెడతారు లేదా అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటారు. రాజధాని పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. రెండో ఫేజ్, మూడో ఫేజ్ అంటూ వ్యాపారం కోసం రైతుల భూములను లాక్కుని వారిని కాల్చుకు తింటున్నారు. అసలైన అమరావతి అయిన శివయ్య గుడి ఉన్న ప్రాంతంలో రైతులకు సాగునీరు లేదు. కృష్ణా డెల్టాలో రైతులు నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఎరువులు ఇచ్చే నాథుడు లేడు. ఈ సొల్లు కబుర్లు, పచ్చ మీడియా భజనలు ఆపి.. ముందు వర్షాధారిత రైతులకు సాగునీరు, ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. బోండా ఉమకు నా సవాల్.. రూ. 50 కోట్లు ఇచ్చినట్టు నిరూపించాలి ఈ మధ్య మన బెజవాడలో కనపడకుండా పోయిన ఓ పిట్టల దొర బయటికొచ్చాడు. సంస్కార హీనుడైన అధమ శ్రేష్టుడు నా మీద, నా భార్య మీద పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. నేను నా స్థలంలో అద్దె కోసం రెండు గోదాములు కట్టుకున్నాను. అందులో స్టాక్ తగ్గిందని నా దగ్గర పనిచేసేవాళ్లు చెబితే.. నైతికంగా బాధ్యత వహించి నేనే ఆ పెనాల్టీ కడతానని డిపార్ట్‌మెంట్‌కు రాతపూర్వకంగా చెప్పాను. పది రోజులు ఆగి కుట్రపూరితంగా నా మీద, నా భార్య మీద కేసులు కట్టారు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా సంస్కారవంతంగా మాట్లాడలేని ఆ ఎదవకు ఒకటే చెబుతున్నా.. నేను, మా ఆవిడ వెళ్లి ఎవడో 'మావయ్య' కాళ్ల మీద పడి రూ. 50 కోట్లు కట్టామని వాగుతున్నావు కదా? ఆ మావయ్య చంద్రబాబు అయినా, లోకేష్ అయినా ఇంకెవరైనా సరే.. నా సవాల్. మేము ఆ మావయ్య ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ గానీ, ఒక్క ఫోటో గానీ ఉంటే బయటపెట్టండి. నిజంగా నేను రూ. 50 కోట్లు క్యాష్ రూపంలో ఇస్తే అది నేరం కదా? దమ్ముంటే ఈడీతో కేసు పెట్టించి నన్ను, ఆ రూ. 50 కోట్లు తీసుకున్న మీ మావయ్యను ఇద్దరినీ జైల్లో వేయండి! నిరూపించే దమ్ముందా? సిగ్గు శరం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోం. ఏ ఆధారం లేకుండా ఇంట్లో ఆడవాళ్లపై నిందలు వేయడం మానుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని హితవు పలికారు.