రాయచోటి: వైయస్ఆర్‌సీపీలో వివిధ కమిటీల్లో పదవులు పొందిన పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం రాయచోటి పట్టణంలోని బోస్‌నగర్ వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, హిందూపురం పరిశీలకులు రెడ్డెప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా కుటుంబ సభ్యుల్లా కలిసికట్టుగా పనిచేసి వైయస్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని, గుర్తింపు కార్డులు పొందిన కార్యకర్తకు ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ.5 లక్షల పరిహారం అందించే భరోసా ఉందని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శిస్తారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడ్డాయని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడంతో ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని, కరువు పరిస్థితులతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొత్తగా పెన్షన్లు, పక్కా ఇళ్ల మంజూరులోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కూటమి పాలనలో సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు : రమేష్‌కుమార్‌రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి దూరమయ్యాయని వైయస్ఆర్‌సీపీ హిందూపురం పరిశీలకులు రెడ్డెప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కరువు పరిస్థితుల్లో తాగునీరు, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి వైయస్ఆర్‌సీపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు వైయస్ఆర్‌సీపీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని రమేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, వైయస్ఆర్‌సీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, మాజీ సర్పంచులు వెంకట్రామిరెడ్డి, ఆంజనేయులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.