మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం

 మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ నివాళులు

తాడేపల్లి: మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ అందించిన సేవలను, దేశ నిర్మాణంలో లాల్‌ బహదూర్‌ శాస్త్రి పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

అహింసా మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ సాగించిన పోరాటం, ‘జై జవాన్‌.. జై కిసాన్‌’ నినాదంతో లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశానికి అందించిన స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. దేశం కోసం ఈ మహనీయులు చేసిన త్యాగం, సేవలు చిరస్మరణీయమని తెలిపారు. వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌, రాయన భాగ్యలక్ష్మి, పూనూరు గౌతమ్‌రెడ్డి, వంగవీటి నరేంద్ర, అంకంరెడ్డి నాగనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

వైయ‌స్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా..

అహింసా మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ సాగించిన పోరాటం, సత్యం–అహింస సిద్ధాంతాల పట్ల ఆయన చూపిన అచంచల నిబద్ధత దేశ ప్రజలకు చిరస్మరణీయమని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. అలాగే ‘జై జవాన్‌.. జై కిసాన్‌’ నినాదంతో సైనికులు, రైతుల సేవలకు గౌరవం కల్పిస్తూ దేశానికి స్ఫూర్తినిచ్చిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి సేవలు కూడా తరతరాలకు ఆదర్శమని తెలిపారు. దేశం కోసం ఈ మహనీయులు చేసిన త్యాగం, చూపిన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు వైయ‌స్‌ జగన్‌ తెలిపారు.

Back to Top