తెలిసే వంచన! 

బీసీలకు మళ్లీ చంద్రబాబు వెన్నుపోటు

కోర్టు కొట్టేస్తుందని తెలిసే 34 శాతం రిజర్వేషన్లంటూ జీవోలు 

చట్టం ద్వారా మాత్రమే రిజర్వేషన్లు సాధ్యమని తెలిసినా నాటకాలు 

కేంద్రంలో టీడీపీపై ఆధారపడిన ప్రభుత్వం ఉన్నా ఒత్తిడి చేయని బాబు 

బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి లేకనే మీనమేషాలు 

రెండున్నరేళ్లలో ఎలాంటి ప్రయత్నమూ చేయని బాబు.. స్థానిక ఎన్నికల్లో లబ్ధికోసమే బీసీ రిజర్వేషన్‌ నాటకం

ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళతామంటూ మళ్లీ వంచన.. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే పలుసార్లు చెప్పింది 

ఇప్పుడు మళ్లీ అదే తీర్పు వస్తుంది.. కోర్టు తీర్పులు చూపించి తప్పించుకునే ఎత్తు 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రిజర్వేషన్‌పై జీవో ఇస్తే టీడీపీ నాయకుడితో కేసు 

చంద్రబాబు వేయించిన కేసులో 34శాతం జీవోను కొట్టేసిన కోర్టు 

అలాంటి కుట్రలన్నీ దాచి.. సాధ్యం కాదని తెలిసీ బాబు నాటకాలు 

బీసీలను దారుణంగా వంచించి ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎత్తులు

 అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు మరోమారు వెన్నుపోటు రుచి చూపించారు. 34 శాతం రిజర్వేషన్లు కోర్టుల ముందు నిలబడవని తెలిసీ దారుణంగా వంచించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు మొక్కు బడిగా కల్పించిన 34 శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేయడంతో బాబు బండారం బట్టబయలైంది. కేవలం జీవో ఇచ్చి ఊరుకుంటే కోర్టులు కొట్టేస్తాయని ఆయనకు తెలుసు. రిజర్వేషన్లు 50శాతం దాటరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు తీర్పులిచ్చిన సంగతీ చంద్రబాబుకు తెలుసు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమనే విష యం చంద్రబాబుకు బాగా తెలుసు. కేంద్రంలో టీడీపీ బలంపై ఆధారపడిన ప్రభుత్వం ఉన్నదన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ కేంద్రంపై వత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం చేయించే పని చేయ కుండా ఓ జీవో ఇచ్చి బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ కురిపించారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే హైకోర్టు ఆ జీవోను కొట్టేసింది. 

అలా బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు డ్రామాలో మరో అంకం పూర్తయింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని ఆయన అంటున్నారు. డ్రామాలో ఇది ఇంకొక అంకం. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఈ డ్రామాను మరికొన్ని రోజులు నడిపించవచ్చు. బీసీల కోసం చంద్రబాబు నిజంగా ప్రయత్నిస్తున్నాడని కొంతమందినైనా నమ్మించవచ్చు. కానీ చంద్రబాబు ఆడుతున్న నాటకం బీసీలకు అర్థమయ్యింది. తమకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబులో ఏ కోశానా కనిపించడంలేదని వారు మండిపడుతున్నారు. టీడీపీ బలంపై కేంద్రప్రభుత్వం ఆధారపడి ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయడానికి ఇదో మంచి అవకాశమని అందరూ భావిస్తున్నారు. కానీ చంద్రబాబులో చిత్తశుద్ధి, నిజాయితీ లేదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టుకు వెళ్తామంటూనే, మరోవైపు అన్ని మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల అధికారులకు ఎన్నికల నిర్వహణకు సిద్ధంకావాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చేశారు. 

బీసీల కోసం కేంద్రంపై ఒత్తిడి చేసిందెక్కడ? 
వాస్తవానికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చారు. చట్టం ఏం చెబుతోంది.. సుప్రీంకోర్టు తీర్పులు ఏమంటున్నాయి.. అన్న విషయాలు తెలుసుకోకుండానే ఆయన ఈ హామీని ఇచ్చారని అనుకోవడానికి వీలేలేదు. బీసీల పట్ల నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేంద్రంలో తనకున్న పలుకుబడిని, కేంద్రం తమపై ఆధారపడి ఉన్న పరిస్థితిని ఉపయోగించుకుని బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చేందుకు ప్రయత్నించొచ్చు. నెలనెలా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే చంద్రబాబు, ఏ రోజు కూడా బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించిన దాఖలాల్లేవు.  కేంద్రానికి ఓ వినతిపత్రం కూడా పంపలేదు. బీసీలకు 50 సంవత్సరాలకే రూ.4వేల పెన్షన్‌ అందిస్తామన్నారు. ధోకా ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.. ధోకా.. బీసీలకు సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నారు.. మూడు బడ్జెట్‌లలో బీసీ లకు సబ్‌ప్లాన్‌ ఉందా.. వీటిని బట్టి అర్థం కావడంలేదూ వెన్నుపోటులో చంద్రబాబు గోల్డ్‌మెడల్‌ హోల్డరని.

మోసాన్ని దాచి ప్రతిపక్షంపై విమర్శలు 
బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వైఎస్సార్‌సీపీ వాళ్లే హైకోర్టులో కేసులు వేసి రిజర్వేషన్లను అడ్డుకున్నారనే అబద్ధాలతో కొత్త డ్రామాలకు తెరతీశారు. వాస్తవానికి ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ(సర్‌) ప్రక్రియ ముగిసిన తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత  స్థానిక సంస్థలను నిర్వహించాలని మాత్రమే వైఎస్సార్‌సీపీ హైకోర్టును కోరింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరలేదు. అయితే చంద్రబాబు మాత్రం రిజర్వేషన్ల వైఫల్యాన్ని వైఎస్సార్‌సీపీకి ముడిపెట్టి ప్రతిపక్షాన్నే నిందిస్తున్నారు.  

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను గతంలో అడ్డుకున్నది చంద్రబాబే.. 
2020–21 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28నే జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 58.95 శాతం రిజర్వేషన్ల అమలుకు జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ చంద్రబాబు కోర్టులో కేసు వేయించారు. బిర్రు ప్రతాపరెడ్డి అనే టీడీపీ నాయకుడితో చంద్రబాబు ఈ నాటకం ఆడించారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రతాపరెడ్డి ఓ నామినేటెడ్‌ పదవి కూడా అనుభవించారు. చంద్రబాబు వేయించిన కేసు నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50శాతం మించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు కోర్టులో ఎందుకు అడ్డుకున్నారు చంద్రబాబూ..? బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ వస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని సొంత పారీ్టలోనే కొందరు నాయకులు విమర్శించడం నిజం కాదా..? 

చేతులు దులుపుకునేందుకే సుప్రీంకోర్టుకు అప్పీలు.. 
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేస్తూ తీర్పునివ్వడంతో దానిపై సుప్రీంకోర్టుకెళతామని చంద్రబాబు ప్రకటించేశారు. తద్వారా త్వరగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసి, అంతే త్వరగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సబబు కాదని చెప్పించాలన్నదే ఆయన వ్యూహం. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించిన ఏ కేసులో కూడా సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను సమర్థించిన దాఖలాలే లేవు. ఇదే పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు చేసిన రిజర్వేషన్ల వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటినప్పుడు అందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. ఆ తీర్పుల ఆధారంగానే ఇపుడు ఏపీ హైకోర్టు కూడా బీసీలకిచ్చిన 34 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు మళ్లీ వెళ్లినా కూడా ఏం జరుగుతుంది? గతంలో ఇచ్చిన తీర్పునే ఇస్తుంది. ఈ విషయం తెలిసీ కాలయాపన కోసమే చంద్రబాబు డ్రామాలు... రిజర్వేషన్లను కోర్టులు కొట్టేశాయి కాబట్టే, తానేం చేయలేకపోతున్నానని బీసీలను వంచించేందుకు చంద్రబాబు నాటకాలు.. వాస్తవానికి హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌కు ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసింది. అయితే సుప్రీంకోర్టుకెళ్లడానికి ముందే నోటిఫికేషన్‌ ఇస్తే, వంచన బయటపడుతుందన్న భయంతో ఆ పని చేయకుండా ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు ఆపారని అధికారవర్గాల్లో వినిపిస్తోంది.  

బాబు సర్కార్‌ తీరును అనుమానించిన హైకోర్టు... 
అసలు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా క్షేత్రస్థాయిలో బీసీల గురించి ఎలాంటి సర్వే చేయలేదు. బీసీ స్థితిగతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కోర్టుకు మాత్రం కమిషన్‌ నివేదిక, సిఫారసుల మేరకే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన హైకోర్టు, రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నివేదికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కంగుతిన్న చంద్రబాబు ప్రభుత్వం విధి లేని పరిస్థితుల్లో కమిషన్‌ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టుకు, ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని గ్రహించింది. దీంతో ఎలాంటి శాస్త్రీయ సర్వే లేకుండా, బీసీల స్థితిగతులను తెలుసుకోకుండా వారికి నామమాత్రంగా, మొక్కుబడిగా ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లను కొట్టేసింది. అసలు కమిషన్‌ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదు. దాన్ని అత్యంత రహస్యంగా ఉంచింది. నివేదికను ఎందుకు బహిర్గతం చేయడంలేదని హైకోర్టు ప్రశ్నించినా పట్టించుకోలేదు.  

బీసీ రిజర్వేషన్లపై ఎప్పడు ఏం జరిగిందంటే.. 
⇒ 2019 డిసెంబర్‌ 28: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీఓ 176 ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకుడు బిర్రుప్రతాపరెడ్డి చేత చంద్రబాబు కేసువేయించారు. 
⇒ 2020 మార్చి 2: బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌తో మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు అవుతాయని ఆ జీఓను ఏపీ హైకోర్టు కొట్టేసింది. 
⇒ 2021 మార్చి 4:  వికాస్‌ కిషన్‌రావు గవాలి తీర్పులో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు మూడు అంశాలు(ట్రిపుల్‌ టెస్ట్‌)ను స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.  
⇒ 2026 ఆగస్టు 20: స్థానిక సంస్థలైన గ్రామాల్లో 34శాతం(జీఓ105), పట్టణాల్లో 33.33శాతం(జీఓ 1065) ద్వారా బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ప్రభుత్వం జీఓలు ఇచ్చింది. 
⇒ 2026 సెపె్టంబర్‌: 34 శాతం నిర్ణయానికి ఆధారమైన గణాంకాలు, కమిషన్‌ నివేదిక, చట్టపరమైన ప్రాతిపదికను ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.  
⇒ 2026 అక్టోబర్‌ 1: స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీఓలను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది.  

CM Chandrababu backstabs BCs again
బాబుకు గుణపాఠం చెప్పడం ఖాయం 
చట్టబద్ధత లేకుండా తెచ్చిన జీవోలు హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు కుటిల నైజం మరోసారి బట్టబయలైంది. యావత్‌ బీసీ సమాజానికి చంద్రబాబు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో బాబుకు బీసీ సమాజం గుణపాఠం చెప్పడం ఖాయం. 
– చెల్లుబోయిన వేణు, వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి  

బాబు కల్లిబొల్లి మాటలు బీసీలు నమ్మరు 
బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. బీసీలను అణగదొక్కేందుకు రిజర్వేషన్ల పేరిట రాజకీయ కుట్రకు తెరతీశారు. బాబు చెప్పే కల్లిబొల్లి మాటలు, అబద్ధపు జీవోలతో బీసీలను మరోసారి మోసం చేయలేరు. 
– గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ 

మోసకారితనం బట్టబయలైంది 
బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసి బాబు ప్రభుత్వ మోసకారితనాన్ని బట్టబయలు చేసింది. ఇదంతా బీసీలను దగా చేయడానికి చంద్రబాబు ఆడిన నాటకం. బాబు ప్రభుత్వ మోసకారి విధానాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. 
– వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

చిత్తశుద్ధి లేదని రుజువైంది 
బీసీలకు రిజర్వేషన్ల విషయంలో బాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రుజువైంది. ‘మేము ఇవ్వాలనుకున్నాం.. కానీ కోర్టు కొట్టేసింది’ అనే సాకుతో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోంది. ఇకనైనా బీసీలపై కపట ప్రేమ మానుకొని, చిత్తశుద్ధితో వ్యవహరించాలి. 
– కె.రామకృష్ణ, సీపీఐ జాతీయ కార్యదర్శి 

పార్లమెంటులో చట్టం చేయించాలి 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో చట్టం చేయించాలి. 
– కేశన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

చంద్రబాబు మోసానికి ఫుల్‌స్టాప్‌ 
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేయాలనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు తీర్పుతో ఫుల్‌స్టాప్‌ పడింది. రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు చేయడం, ఆ తర్వాత కోర్టుల్లో ఎదురుదెబ్బలు తినడం చంద్రబాబుకు అలవాటే. 
 – ఉషశ్రీ చరణ్, వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి 

34 శాతం రిజర్వేషన్లపై బీసీలకు బాబు వెన్నుపోటు 
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు పారీ్టకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి, చట్టపరమైన చర్యలు చేపట్టి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధించాలి. బీసీల రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జీఓలు జారీ చేయడం సిగ్గుచేటు. 
– వరుదు కళ్యాణి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ   

Back to Top