తాడేపల్లి: రాష్ట్రంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలకు తూట్లు పొడుస్తూ కూటమి ప్రభుత్వం రాక్షస ప్రభుత్వాన్ని నడిపిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కురుసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొని ఆ మహానేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా మార్గంతో దేశానికి స్వాతంత్ర్యం తెస్తే, నేడు ఏపీలో కూటమి ప్రభుత్వం 'రెడ్ బుక్' రాజ్యాంగంతో హింసను, అణచివేతను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు అని తేడా లేకుండా గళం ఎత్తిన ప్రతి ఒక్కరిపై లాఠీ ఛార్జీలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని, ఆయన పేరుతో ఉన్న పథకాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ గాంధీజీని అవమానిస్తోందని విమర్శించారు. - వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్‌గా నిలిచిన వైఎస్ జగన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. కానీ నేడు విద్యాశాఖలో డీఎస్సీ-2025 పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు, ఫేక్ సర్టిఫికెట్ల దందాలు జరుగుతున్నా, లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నా సంబంధిత మంత్రి నారా లోకేష్ సిగ్గులేకుండా పదవిని అంటుపెట్టుకుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ అందించి, జలయజ్ఞం ద్వారా రైతులకు భరోసా కల్పించి లాల్ బహదూర్ శాస్త్రి 'జై జవాన్ - జై కిసాన్' నినాదాన్ని ఆచరణలో చూపించారని గుర్తుచేశారు. కానీ నేడు రాష్ట్రంలో వ్యవసాయం దండగ అనే పరిస్థితులు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్న ఈ రాక్షస పాలనపై ప్రజలందరూ, ప్రజాస్వామ్య వాదులు గళం విప్పాలని, ఆ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని నేతలు స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ గారు నిత్యం ప్రజలతో మమేకమై, వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణ మూర్తి, పార్టీ అధికార ప్రతినిధి షరీఫ్, పార్టీ నూర్‌బాషా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.