తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో కూటమి ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడి, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. డీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, మెరిట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయం, అధికార పార్టీ నేతల సిఫార్సులతో నియామకాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, డీఎస్సీ లీకేజీలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... మెగా డిఎస్సీ పేరుతో మెగా దగా.. డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఘోరంగా మోసం చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 6,000 ఉద్యోగాలను కూడా కలిపి, మేమే 16,000 ఉద్యోగాలు ఇచ్చామని నారా లోకేష్ జబ్బలు చర్చుకోవడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సచివాలయాలు, ఆర్టీసీ, విద్యా, వైద్య, పోలీసు శాఖల్లో ఏకంగా 2.70 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తే ఎప్పుడూ ఇలా డబ్బా కొట్టుకోలేదు. చేసేదంతా దోపిడీ, చెప్పేదంతా బోగస్ తప్ప తండ్రీకొడుకులిద్దరికీ నిజాలు మాట్లాడే అలవాటే లేదు. 32,000 ఫిర్యాదులు.. 'డైనింగ్ సెలక్షన్ కమిటీ'గా డిఎస్సీ డిఎస్సీ అంటే 'డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ' కాగా, దాన్ని 'నారా వారి డైనింగ్ సెలక్షన్ కమిటీ'గా మార్చేశారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తమ వర్గం వారికి ఉద్యోగాలు పంచుకున్నారు. లంచాలు ఇచ్చిన వారికి, తమకు నచ్చిన వారికి కాల్ లెటర్లకు బదులు 'ఎల్ (లాయల్టీ) లెటర్లు' ఇచ్చారు. 16,000 ఉద్యోగాల నియామకాలకు సంబంధించి దాదాపు 32,000 పైచిలుకు ఫిర్యాదులు వచ్చాయంటే ఈ నియామకాల్లో ఎంతటి అనర్హత, అసమర్థత ఉందో అర్థమవుతోంది. ఒక్క ఫిర్యాదు పైనా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. టాపర్లకు రాని ఉద్యోగాలు.. లీకేజీలు, అక్రమాలకు జీవో 4, 47 సాక్ష్యం.. పరీక్ష పత్రాలు తయారు చేసే SCERT లో పనిచేసే ఒక ఉద్యోగికి మొదటి ర్యాంక్ వస్తే, అతనికి ఉద్యోగం ఇవ్వకుండా కౌన్సిలింగ్ నుంచి తప్పించారు. అంటే పేపర్ లీక్ అయిందనేది స్పష్టంగా నిరూపణ అవుతోంది. 15 లక్షలు ఇస్తే డిఎస్సీ ఉద్యోగం ఇప్పిస్తానన్న వ్యక్తి వీడియో వైరల్ అయినా, అతనిపై కేసు పెట్టకుండా 'అన్నోన్ పర్సన్' అని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు అమ్ముకోవడానికే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. వ్యాపారం పూర్తయ్యాక ఆ జీవోలను రద్దు చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపైనా అనుమానాలు... స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలపై కూడా సీబీఐ విచారణ జరపాలి. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు అన్యాయం చేసి.. రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాజీనామా చేసేవరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదు.. కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయితే బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారి తరహాలోనే, ఇక్కడ విద్యాశాఖలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. డిఎస్సీ లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలి. రోడ్ల మీదకొచ్చి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై కేసులు పెట్టి వేధించడం మానుకోవాలి. నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు, బాధితులకు న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపే ప్రసక్తే లేదు. వెలిగొండకు వైఎస్సార్ పునాది.. జగన్ హయాంలో రెండు టన్నెళ్ల పూర్తి వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్సార్ శంకుస్థాపన చేసి, తన హయాంలో 60 శాతానికి పైగా పనులు పూర్తి చేశారు. అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అవసరమైన అనుమతులు తీసుకురావడంతో పాటు రూ.8 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి, రూ.6 వేల కోట్లకు పైగా పనులు చేపట్టి, రెండు టన్నెళ్లను పూర్తిచేసి జాతికి అంకితం చేసింది. కాలువలు, భూసేకరణ, పరిహారం, నిర్వాసితులకు అవార్డులు, స్టోరేజ్ ట్యాంకులు తదితర కీలక పనులు కూడా వైఎస్సార్ హయాంలోనే జరిగాయి. వెలిగొండ నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయిస్తారా? వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పూర్తిగా చెల్లించకుండా, ఇళ్లను ఖాళీ చేయాలంటూ అధికారులు ఒత్తిడి చేయడం దారుణమని తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1100 మంది నిర్వాసితుల పేర్లు ఇప్పటికీ అవార్డు లిస్టులో లేవు. వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాత కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని... ప్యాకేజీ ఇవ్వకుండా పోలీసులతో బెదిరించడం, కరెంట్ కట్ చేస్తామని అధికారులు హెచ్చరించడం సరికాదని స్పష్టం చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చంద్రశేఖర్ హెచ్చరించారు.