శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన ఈదుమూడి గ్రామ యాదవులు

దాడి ఘటనపై ఆవేదన.. 

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని జగన్ భరోసా

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన యాదవులు ఇవాళ తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ ఆవేదనను వివరించారు. అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బొట్ల రామారావు, బాధితుడు అటలమూడి మధుబాబు మీడియాతో మాట్లాడారు.

తాడేపల్లి: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన యాదవులు బుధవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరిగిన దాడి, అనంతరం తమపైనే నమోదైన కౌంటర్‌ కేసు, పోలీసుల వ్యవహారశైలితో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు అండగా ఉంటామని శ్రీ వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి  బొట్ల రామారావు, బాధితుడు అటలమూడి మధుబాబు మీడియాతో మాట్లాడారు.

మీడియా సమావేశంలో బొట్ల రామారావు, బాధితుడు మధుబాబు ఏమన్నారంటే..

- బాధితులపైనే కౌంటర్‌ కేసులు పెట్టడం దుర్మార్గం: బొట్ల రామారావు

“ఈదుమూడి గ్రామంలో గొర్రెలు మేపుకుంటున్న యాదవులపై జరిగిన దాడిపై ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించాం. చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామానికి చెందిన అటలమూడి అనిల్‌, మధుబాబును ఈదుమూడి గ్రామంలోని టీడీపీ కార్యాలయం ముందు పట్టుకుని కొట్టడం అత్యంత శోచనీయం. పొలాల్లో పంటలు లేని సమయంలో మేత కోసం వెళ్లిన గొర్రెల కాపరులపై కక్షతో దాడి చేసి గాయపరిచారు.

ఈ ఘటనపై నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్‌లో 57/2026 కేసు నమోదైంది. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్య నివేదిక కూడా ఉంది. అయినా ఉప్పల వెంకట సుబ్బారావు వర్గం 58/2026గా కౌంటర్‌ కేసు పెట్టి, బాధితులనే ముద్దాయిలుగా చూపిస్తూ అరెస్టు చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గం. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలో బాధితులు తమ సమస్యను ఆయనకు వివరించేందుకు ప్రయత్నించినా అడ్డుకున్నారు.”

- పి-4 ఆదర్శ గ్రామంలోనే యాదవులకు రక్షణ లేదా?

“చంద్రబాబు నాయుడు పి-4 ఆదర్శ గ్రామంగా చెప్పుకునే ఈదుమూడిలోనే యాదవులు, బీసీలపై ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి. ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని మిగతా ఆదర్శ గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆలోచిస్తున్నారు. బాధితులకు రూ.60 వేల నగదు ఇచ్చి, కేసుల జోలికి వెళ్లొద్దని స్థానిక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చెప్పినట్లు మా దృష్టికి వచ్చింది. తమ వర్గీయులను, తమ సామాజిక వర్గాన్ని కాపాడుకునేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

అనిల్‌, మధుబాబు కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అఖిల భారత యాదవ మహాసభ, బీసీ సంఘాలు అండగా ఉంటాయి. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాధితులను కలిసి భరోసా ఇచ్చారు. రక్షణ కల్పించడంతో పాటు న్యాయం జరిగేలా పార్టీ తరఫున అండగా ఉంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి అనిల్‌, రమేష్‌, పార్టీ నాయకత్వం, లీగల్‌ సెల్‌ను సంప్రదించి బాధితులకు పూర్తి సహకారం అందిస్తాం. కులం పేరుతో బాధితుల కుటుంబంలోని మహిళలను దూషించిన ఘటనపైనా న్యాయపోరాటం చేస్తాం. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం.”

- కులం పేరుతో దూషించి మాపై దాడి చేశారు: మధుబాబు

“నా పేరు అటలమూడి మధుబాబు. మాది చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామం. 2026 జూన్ 7న మేము గొర్రెలు మేపుకోవడానికి ఈదుమూడి గ్రామానికి వెళ్లాం. పొలాల్లో గొర్రెలను మేపుకుంటున్న సమయంలో ఉప్పల వెంకట సుబ్బారావు వచ్చి ‘నా కొడకల్లారా’ అంటూ కులం పేరుతో దూషించి మమ్మల్ని కొట్టాడు. నేను అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయిన తర్వాత ఆయన తన అన్నతో పాటు మరో నలుగురిని తీసుకొచ్చాడు. మళ్లీ నా తమ్ముడు అనిల్‌పై దాడి చేసి గడ్డపారతో కొట్టాడు. ఆ తర్వాత నన్ను కూడా కొట్టాడు.
‘మీ తమ్ముడే మమ్మల్ని కొట్టి మా కులం పేరుతో తిట్టాడు’ అని మాపై నింద వేశారు. దానికి ఆయన ‘నేను వందసార్లు అంటా.. ఏం చేస్తావురా’ అంటూ కులం పేరుతో దూషించాడు. మమ్మల్ని తీవ్రంగా కొట్టారు.”

- టీడీపీ కార్యాలయం వద్ద మళ్లీ దాడి చేసి చంపుతామని బెదిరించారు

“ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యాలయం ముందు మమ్మల్ని మళ్లీ పట్టుకున్నారు. రాత్రి సుమారు 8.30 గంటలకు అక్కడే మళ్లీ కొట్టారు. ఎక్కడైనా ఈ విషయం చెబితే, ఏం చేసినా చంపి పాతిపెడతామని బెదిరించారు. మమ్మల్ని భయపెట్టి అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత ఈ ఘటనపై 10వ తేదీన మేము పోలీసులకు కేసు పెట్టాం. మాపై దాడి చేసిన వారిపై కేసు పెట్టిన తర్వాత కూడా మాకు న్యాయం జరగలేదు. పైగా మాపైనే రివర్స్‌ కౌంటర్‌ కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మా కుటుంబాలకు న్యాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి మా ఆవేదన చెప్పుకున్నాం. ఆయన మాకు అండగా ఉంటామని, రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.”
 

Back to Top