విజయవాడ: డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రమేష్ యాదవ్, వరుదు కళ్యాణి తదితరులు సవాల్ చేశారు. శాప్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పోలీసులు అడ్డంకులు సృష్టించడంతో ఎమ్మెల్సీలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వైయస్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా నిర్వహిస్తున్న ధర్నాను అడ్డుకోవడం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుపై డీఎస్సీ వ్యవహారం ప్రభావం చూపుతోందని రమేష్ యాదవ్ పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని కోరారు.