తాడేపల్లి: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో రోజుకో కొత్త ఆధారం వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం మాత్రం అంతా సక్రమంగానే జరిగిందంటూ బుకాయిస్తోందని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనకు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం, వారిపై దాడులు చేయించడం ద్వారా అసలు సమస్యను పక్కదారి పట్టించలేరన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన వ్యవహారాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించాలని కోరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయం? “డీఎస్సీలో తప్పు జరగలేదని చంద్రబాబు నాయుడు నిజంగా నమ్ముతున్నారంటే సీబీఐ విచారణకు అంగీకరించాలి. తాను తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం ఆయనకే ఉంటుంది. వైయస్ఆర్‌సీపీ చెప్పినవి తప్పని విచారణలో తేలితే మా పరువే పోతుంది. మరి ఎందుకు వెనుకాడుతున్నారు? రోజుకో కొత్త ఆధారం బయటపడుతున్నా ‘ఏమీ జరగలేదు.. అంతా బాగుంది’ అని చెప్పడం సమాధానం కాదు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ రావడం, జాబితా మార్చడం, ఫేక్ సర్టిఫికెట్లు బయటపడటం, టెట్ అర్హతలు లేని వారికి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిందే.” మూడున్నర లక్షల మంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి “ఇది వైయస్ఆర్‌సీపీకి సంబంధించిన సమస్య కాదు. డీఎస్సీ రాసిన మూడున్నర లక్షల మంది ఉద్యోగార్థుల సమస్య. ఒక అర్హుడికి రావాల్సిన ఉద్యోగాన్ని అనర్హుడికి ఇస్తే ఆ అర్హుడి భవిష్యత్తును ఎవరు తిరిగి ఇస్తారు? సబ్జెక్టుకు సంబంధం లేని అర్హతలు, టెట్ అర్హత లేకపోయినా అవకాశాలు, రిజర్వేషన్ నిబంధనలకు భిన్నంగా ఎంపికలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై అనుమానాలు.. ఇలా ఒక్కొక్క అంశం బయటకు వస్తోంది. ఏడు దశల వెరిఫికేషన్ చేశామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు ప్రతి అభ్యర్థి అర్హత, సర్టిఫికెట్, ఎంపికకు సంబంధించిన పూర్తి రికార్డులను ప్రజల ముందుంచాలి. నిజమైన మెరిట్ ఉన్న ప్రతి అభ్యర్థికి న్యాయం జరగాలి.” దాడులతో ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు “శాంతియుతంగా నిరసన చేయడానికి వెళ్తున్న మా నాయకులు, కార్యకర్తలను ఎందుకు అడ్డుకున్నారు? పోలీసులతో లాఠీచార్జ్ ఎందుకు చేయించారు? మా పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి దాడులు చేయాల్సిన అవసరం వాళ్లకేంటి? మా కార్యక్రమాన్ని నాలుగు రోజుల ముందే ప్రకటించాం. అక్కడికి ఎవరు వచ్చారు, వారికి వసతి ఎవరు ఏర్పాటు చేశారు, బస్సుల్లో ఎవరు తీసుకొచ్చారు, మైకులు ఎవరు ఏర్పాటు చేశారు, నినాదాలు ఎవరు తయారు చేశారు అన్నది ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం దగ్గర సమాధానం లేకపోతే ప్రతిపక్షంపైకి దాడులు మళ్లించడం పరిష్కారం కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒకవైపు దాడులు జరుగుతుండగా మరోవైపు రన్నింగ్ కామెంటరీ ఇవ్వడం బాధ్యతాయుతమైన తీరు కాదు.” డీఎస్సీ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేది లేదు “డీఎస్సీ వ్యవహారంపై మేము ప్రజాక్షేత్రంలోనూ, న్యాయస్థానాల్లోనూ పోరాటం చేస్తాం. ఇప్పటికే బయటకు వచ్చిన ఆధారాలను ప్రజల ముందుంచాం. ఇంకా కొత్త ఆధారాలు వస్తే వాటినీ బయటపెడతాం. తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగాలు పొందినవారిని మాత్రమే కాదు.. వారిని ఎంపిక చేసినవారు, సర్టిఫికెట్లను వెరిఫై చేసినవారు, ఈ ప్రక్రియలో బాధ్యత వహించినవారు కూడా బాధ్యత వహించాల్సిందే. నిజంగా స్పోర్ట్స్ కోటాలో అర్హతతో ఎంపికైన వారికి అన్యాయం జరగకూడదు. మూడున్నర లక్షల మంది ఉద్యోగార్థులు, యువత, ప్రజా సంఘాలు, మేధావులు ఈ అంశాన్ని ప్రశ్నించాలి. భవిష్యత్తులో ఏ నియామకంలోనూ ఇలాంటి పరిస్థితి రాకుండా పారదర్శకమైన వ్యవస్థ ఏర్పడే వరకు మా పోరాటం కొనసాగుతుంది.”