పెనుకొండ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు సమష్టిగా సన్నద్ధం కావాలని శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. పెనుకొండ మండలం మావటూరు పంచాయతీలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని అండగా నిలవాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, పరస్పర సహకారంతో క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.