వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల దాడి

 శాప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. 

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా అక్రమాలపై సీబీఐ విచారణకు వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ 

 విజయవాడ: డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలో వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శాప్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు చేరుకోగా పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు. ఇదే సమయంలో టీడీపీ అనుబంధ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు, టీడీపీ కార్యకర్తలు టీచర్ల ముసుగులో శాప్‌ కార్యాలయం వద్దకు వచ్చి వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని, పలువురికి గాయాలయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి. విద్యార్థి విభాగం నేతలపై కర్రలతో దాడి చేశారని ఆరోపించాయి. మరోవైపు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వైయ‌స్ఆర్‌సీపీ నేతలను శాప్‌ కార్యాలయం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌తో పాటు పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అక్కడికి చేరుకుని డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం, మరోవైపు ప్రత్యర్థి వర్గాలకు అవకాశం కల్పించడం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Back to Top