చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని దొడ్డిపల్లె వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ క్వారీ నిర్వహిస్తున్నారని చిత్తూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి ఏం.సి. విజయానంద రెడ్డి ఆరోపించారు. క్వారీ నుంచి అక్రమంగా గ్రానైట్‌ను తరలిస్తూ, ఎమ్మెల్యే నిర్మిస్తున్న వైట్‌హౌస్ భవనానికి వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. చిత్తూరులో జరుగుతున్న అక్రమ క్వారీ దోపిడీని అరికట్టి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీలు పెరిగిపోయాయని విజయానంద రెడ్డి ఆరోపించారు. అక్రమ తవ్వకాలను నియంత్రించడంతో పాటు చిత్తూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని సూచించారు.