స్థానిక సంస్థల పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పునఃపరిశీలించాలి – నిసార్ అహ్మద్ 

 మదనపల్లె: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మదనపల్లె మండలంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పునర్విభజన ప్రక్రియపై వైయ‌స్ఆర్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియను సమగ్రంగా పునఃపరిశీలించాలని కోరారు.

ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ నెల 16న మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు వెల్లడించినప్పటికీ, పూర్తి వివరాలను ముందుగానే అందించకుండా అదే రోజు సాయంత్రంలోగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరడం సమంజసం కాదన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఖరారు చేసి గెజిట్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారని, అయితే గ్రామసభలు, ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియలు సమగ్రంగా జరిగాయా అనే అంశంపై స్పష్టత అవసరమన్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు కోరుతూ, పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఖరారు చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి కూడా ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల పూర్తి జాబితాను కోరుతూ మండల అధికారులకు లిఖితపూర్వకంగా వినతిపత్రం ఇచ్చినా సమాచారం అందలేదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల ఎంపికలో గ్రామాల మధ్య దూరం, ఓటర్ల సంఖ్య, రవాణా, రహదారి పరిస్థితులు, అందుబాటులో ఉన్న స్థలం, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు సౌకర్యాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఈ అంశాలపై కలెక్టర్ సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చోట పోలింగ్ కేంద్రాల పునఃపరిశీలన చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కోరారు. ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలకు తావులేకుండా పూర్తి పారదర్శకత, నిష్పాక్షికతతో ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వి.ఎస్. రెడ్డి, ఈశ్వర్ నాయక్, గ్రానైట్ మహేశ్, ఎన్. నవాజ్ అలీ ఖాన్, బయ్యా రెడ్డి, కొత్తపల్లి మహేశ్, యాసీన్, రియాజ్, మయూర్, నాగమణి, అబ్దుల్లా, సాధిక్, షేక్ జబీ హబీబ్, చెన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
 

Back to Top