శ్రీవారి భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

 అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి 

అమలాపురం: తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన చార్జిషీట్‌లో లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో బీఫ్‌ టాలో, లార్డ్‌ ఉన్నట్లు నిర్ధారణ కాలేదని, నెయ్యి పేరుతో కూరగాయల నూనెలు, సింథటిక్‌ పదార్థాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో చేసిన జంతువుల కొవ్వు వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని జగ్గిరెడ్డి డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చేసే ప్రతి వ్యాఖ్యకు విస్తృత ప్రభావం ఉంటుందని, తిరుమల శ్రీవారి ఆలయం, మహాప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల్లో ఆందోళన కలిగించేలా ఉండకూడదని జగ్గిరెడ్డి అన్నారు. రాజకీయ అంశాలను తిరుమల వంటి అత్యంత పవిత్రమైన క్షేత్రంతో ముడిపెట్టడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వాస్తవాల నేపథ్యంలో చంద్రబాబు తన గత వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వడంతో పాటు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని జగ్గిరెడ్డి కోరారు.
 

Back to Top