శింగనమల: కరువు కోరల్లో చిక్కుకున్న రైతులను, ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డా. సాకే శైలజనాథ్ కోరారు. సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరువు దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన మాట్లాడుతూ ఇది రాజకీయ దీక్ష కాదని, రైతు కన్నీటి కోసం, ఎండిపోతున్న పంటల కోసం, తాగునీటి కోసం జరుగుతున్న పోరాటమన్నారు. శింగనమల నియోజకవర్గంలో బోర్లు, చెరువులు ఎండిపోతున్నాయని, పంటలు, పండ్లతోటలు నీటి కోసం ఎదురుచూస్తున్నాయని, పశువులకు నీరు, మేత కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. హెచ్‌ఎల్‌సీ దిగువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని, కరువు ప్రభావిత మండలాలను గుర్తించి పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని, తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని కోరారు. రైతు పంట ఎండిపోతే అది కేవలం రైతు నష్టం మాత్రమే కాదని, ఆహార భద్రతకు కూడా నష్టమన్నారు. కరువును రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని, కేంద్రం ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, పశుగ్రాసం, తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సరిబాల ప్రతాపరెడ్డి, ఎన్వీ నారాయణ, మధుసూదన్‌రెడ్డి, పూల నారాయణస్వామి, అన్నేరి ఆదినారాయణ, ఏ.పార్వతి, భాస్కర్‌రెడ్డి, బోనాల హరికృష్ణ, ఓబిరెడ్డి, జెల్లీ గోపినాథ్, రామకృష్ణరెడ్డి, రామకృష్ణనాయక్, వెంకటరాముడు, ఆలీ, గోపాల్, సిపిఐ, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.