తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పంచాయతీ గాంధీపురానికి చెందిన దళిత యువకుడు, వైయస్ఆర్‌సీపీ భాకరాపేట సోషల్ మీడియా కన్వీనర్ నాగేంద్రపై భాకరాపేట ఎస్సై కృష్ణయ్య దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నాగేంద్రను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కొట్టారన్న విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. తప్పు జరిగిందని భావిస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిన పోలీసులు, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు రావడం తీవ్ర ప్రశ్నలకు తావిస్తోంది. ముఖ్యంగా బాధితుడు దళిత యువకుడు కావడంతో ఘటనపై వాస్తవాలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం బాధితుడి నుంచి పోలీసులకు అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇప్పించేందుకు ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆ స్టేట్‌మెంట్ స్వచ్ఛందంగా ఇచ్చిందా? లేక ఒత్తిడితో రికార్డు చేశారా? అనే అంశాన్ని కూడా విచారణలో తేల్చాలి. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని స్థానికులు, దళిత సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.