నంద్యాల: మైనార్టీల హక్కులు, ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలని చూడటం దారుణమని నంద్యాల మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. నంద్యాలలో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఎస్డీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషాతో కలిసి హాజరై ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ వైయస్ఆర్సీపీ హయాంలో మైనార్టీల సంక్షేమం, విద్య కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. నంద్యాలలో నిర్మించిన ఉర్దూ కళాశాల వసతిగృహ భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించాలని చూడటం సరికాదన్నారు. వక్ఫ్ బోర్డు, మైనార్టీల స్థలాలను వారి అభ్యున్నతికే వినియోగించాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని శిల్పా రవి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని, కొత్త పెన్షన్లపై స్పష్టత లేదని, రైతులకు రైతు భరోసా అందకుండా ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. మైనార్టీల హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రజా సమస్యలపై వైయస్ఆర్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని, బాధితులు, ప్రజాసంఘాలు చేపట్టే ప్రతి పోరాటానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ తమీమ్, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.