వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం బరితెగింపు

వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు

యథేచ్ఛగా దాడులు చేసిన వెన్నుపోటు పార్టీ కార్యకర్తలు

మరోవైపు పోలీసుల లాఠీఛార్జ్‌. పలువురికి గాయాలు

డీఎస్సీ స్కామ్‌లో రోజురోజుకీ వెలుగులోకి మరిన్ని ఆధారాలు

దిక్కు తోచని స్థితిలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం

అందుకే ఎదురుదాడి. విమర్శలు. ఏకంగా కర్రలతో దాడి

అసలు శాప్‌ కార్యాలయానికి టీడీపీ గుండాలు ఎందుకు వచ్చారు?

డీఎస్సీలో ఎంపికైన టీచర్లను లోపలకు ఎందుకు పంపించారు?

వైయస్సార్‌సీపీ ముందుగానే ప్రకటించి, అక్కడికి వెళ్లింది

మరి వెన్నుపోటు పార్టీ గుండాలను ఎలా అనుమతించారు?

ఇది కేవలం కవ్వింపు, ఘర్షణ వాతావరణ సృష్టి కోసం కాదా?

ఇంకా పలుచోట్ల వైయస్సార్‌సీపీ నాయకుల హౌజ్‌ అరెస్ట్‌

ఎక్కడికక్కడ అడ్డగింత. అరెస్టులు. పోలీస్‌స్టేషన్లకు తరలింపు

ఎక్కడా టీడీపీ గుండాలను నియంత్రించని పోలీసులు

శాంతియుత నిరసన కార్యక్రమంపై దాడిని ఖండిస్తున్నాం

వైయస్సార్‌సీపీ నేతలు, నాయకుల స్పష్టీకరణ

విజయవాడ: డీఎస్సీ– 2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌సీపీ చేపట్టిన పోరుబాటను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆంక్షలను ప్రయోగించింది. మరోవైపు శాప్‌ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై టీడీపీ వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డాయి. విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌస్‌ అరెస్టులు, అరెస్టులకు పాల్పడటంతో పాటు భారీగా పోలీసులను మోహరించారు. అయినా ఆంక్షలను లెక్కచేయకుండా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు శాప్‌ కార్యాలయం వద్దకు చేరుకుని డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని నినదించారు.
    శాప్‌ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ క్రమంలో పలువురు గాయపడగా గౌతంరెడ్డి సొమ్మసిల్లి కిందపడిపోయారని పార్టీ నేతలు పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడులకు దిగినా పోలీసులు అడ్డుకోలేదని ఆరోపించారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. 

ఎక్కడికక్కడ నేతల అడ్డగింతలు, అరెస్టులు:
    విజయవాడకు వస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలను జిల్లాల సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులను కాజా టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించిన అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసి పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు పలువురు నేతలను అరెస్టు చేయగా.. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పేర్ని కిట్టు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ తదితరులను కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
    బాపట్ల మండలం చుండూరుపల్లి వద్ద మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయనను బాపట్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏలూరు నుంచి విజయవాడకు వస్తున్న వైయస్‌ఆర్‌సీపీ యువజన నాయకుడు కామిరెడ్డి నానిని కలపర్రు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నాయి. కష్ణా జిల్లాలో పార్టీ నేతలకు నోటీసులు ఇవ్వడంతో పాటు మచిలీపట్నంలోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు.

శాప్‌ ఆఫీస్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జ్‌:
    శాప్‌ కార్యాలయం వద్ద బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు చొక్కాలు పట్టుకుని పక్కకు లాగి పడేశారు. అనంతరం పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ క్రమంలో గౌతంరెడ్డి సొమ్మసిల్లి కిందపడిపోగా.. పార్టీ నాయకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి నాయకులపైనా పోలీసులు లాఠీచార్జ్‌ చేశారని వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొన్నాయి.

టీచర్ల ముసుగులో రెచ్చపోయిన పచ్చమూకలు:
    మరోవైపు శాప్‌ కార్యాలయం వద్ద టీడీపీ అనుబంధ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు, టీడీపీ కార్యకర్తలు టీచర్ల ముసుగులో వచ్చి వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కొందరు టీడీపీ కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడి ఆందోళన చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలై రక్తస్రావమైనా పోలీసులు దాడి చేసిన వారిని అడ్డుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే రాళ్లదాడి చేయించారని, పోలీసుల వ్యవహారంపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రోడ్డుపై పడుకుని ఎమ్మెల్సీల నిరసన:
    శాప్‌ కార్యాలయం వద్ద తమను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు, నాయకులు రోడ్డుపై పడుకుని ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రమేష్‌ యాదవ్, వరుదు కళ్యాణి, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, అధికార ప్రతినిధులు నాగార్జున యాదవ్, ఆరె శ్యామల తదితరులు డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పోలీసులు అడ్డుకోవడం సరికాదని నేతలు పేర్కొన్నారు.

డీఎస్సీపై సీబీఐ విచారణకు డిమాండ్‌:
    మెగా డీఎస్సీ–2025లో ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైయస్‌ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. తప్పుడు క్రీడా ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా?
: అంబటి రాంబాబు, మాజీ మంత్రి

– డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి తప్పు జరగకపోతే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో జరిగినట్లు చెబుతున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి. సీబీఐ విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.. ఎవరు తప్పు చేశారో తేలుతుంది. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించి ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. మా ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ నియామకాలపైనా విచారణ జరిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుత డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు, అభ్యర్థులు ప్రశ్నిస్తున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? డీఎస్సీపై సమాధానం చెప్పకుండా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు కోసం లోకేష్‌ ఏ పనికైనా సిద్ధంగా ఉన్నాడు.
    నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడటం సరికాదు. నియామక ప్రక్రియపై ఉన్న సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. మా నిరసనలను అడ్డుకునేందుకు ఎన్ని ఆంక్షలు విధించినా వైయస్‌ఆర్‌సీపీ వెనక్కి తగ్గదు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది. లోకేష్‌ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదు.

శాంతియుత నిరసనను అడ్డుకోవడమేంటి?
:జోగి రమేష్, మాజీ మంత్రి

– శాంతియుతంగా ధర్నా చేసేందుకు పిలుపునిస్తే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఎలాంటి హింసకు పాల్పడకుండా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై ప్రశ్నించేందుకు శాప్‌ కార్యాలయం వద్దకు వస్తే నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం, హౌస్‌ అరెస్టులు, అరెస్టులకు పాల్పడటం ఏమిటి? మెగా డీఎస్సీ–2025లో, ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో తలెత్తిన అనుమానాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడంతో పాటు తప్పుడు క్రీడా ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలన్నదే వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన డిమాండ్‌. డీఎస్సీ నియామకాల్లో తప్పు జరగకపోతే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందో స్పష్టంగా సమాధానం చెప్పాలి.  
    డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్‌ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.

Back to Top