సత్తెనపల్లిలో పేకాట క్లబ్‌ను వెంటనే మూసివేయాలి

 అధికార అండతో కొనసాగుతున్న పేకాట క్లబ్‌పై చర్యలు తీసుకోవాలి: డాక్టర్ గజ్జల

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి పట్టణంలో అధికార రాజకీయ అండతో పేకాట క్లబ్ కొనసాగుతోందని, వెంటనే దాన్ని మూసివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సత్తెనపల్లి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి కోరారు. గతంలో పోలీసులు పేకాట క్లబ్‌పై దాడులు నిర్వహించి నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ, అధికార అండతో తిరిగి పేకాట క్లబ్‌ను కొనసాగిస్తున్నారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారని, పేకాటకు అనేక కుటుంబాలు బలవుతున్నాయని పేర్కొన్నారు.

పేకాట క్లబ్‌ను వెంటనే మూసివేసి, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. అనంతరం డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. సత్తెనపల్లి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పేకాట క్లబ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్‌, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ, వార్డు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


 

Back to Top