బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు మరో ముందస్తు కుట్ర

34 శాతం రిజర్వేషన్లపై రేపు కోర్టుకు వెళ్లేది ఆయనే

తేల్చిచెప్పిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

బీసీ రిజర్వేషన్లపై మరోసారి చంద్రబాబు డప్పు

2019లోనే జగన్ 34 రిజర్వేషన్ల జీవో ఇవ్వలేదా?

దీనిపై కోర్టుకెళ్లింది చంద్రబాబు మనిషి కాదా?

మరోసారి బీసీల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు 

అనిల్ కుమార్ యాదవ్ ఫైర్

బీసీ రిజర్వేషన్లపై మళ్లీ కోర్టుకెళ్లేది చంద్రబాబే

34 శాతం రిజర్వేషన్లు వద్దని కేసులేయిస్తారు

తిరిగి వైయ‌స్ఆర్‌సీపీపైనే నెపం నెడతారు

అందుకే ముందస్తుగా లీకులిస్తున్నారు

అనిల్ కుమార్ యాదవ్ ఆక్షేపణ

బీసీలకు 50 శాతం పదవులిచ్చింది జగన్ 

కోర్టు రిజర్వేషన్లు తగ్గిస్తే రాజకీయంగా పదవులిచ్చారు

బీసీల్ని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది

స్దానిక ఎన్నికల్లో బీసీలే ఆయనకు బుద్ది చెప్తారు

అనిల్ కుమార్ యాదవ్ స్పష్టీకరణ

తాడేపల్లి: స్దానిక సంస్ధల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతున్నట్లు వెన్నుపోటు పార్టీ అధినేత చంద్రబాబు డప్పు కొట్టుకోవడం దారుణమని, గతంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గారి హయాంలోనే 34 శాతానికి రిజర్వేషన్లు పెంచితే, వాటిపై తన మనుషులతో పిటిషన్లు వేయించి అడ్డుకున్న ఘనత ఆయనదేనని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తేల్చిచెప్పారు. మరోసారి రిజర్వేషన్ల పెంపు పేరుతో బీసీల్ని మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారని, ఈసారి కూడా తన మనుషులతో వీటిపై పిటిషన్లు వేయించి, తిరిగి ఆ నెపం వైయ‌స్ఆర్‌సీపీ మీద నెట్టేందుకు రంగం సిద్దం చేసుకున్నారని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. రేపు స్దానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలు చంద్రబాబుకు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.
ప్రెస్ మీట్లో అనిల్ కుమార్ యాదవ్ ఇంకేమన్నారంటే..

బీసీల్ని మరోసారి మోసం చేస్తున్న చంద్రబాబు

నిన్న వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. బీసీలకు ఓ చట్టం తెచ్చి, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు, బీసీలకు వాళ్ల పార్టీనే రక్షణ అని, అత్యధిక పదవులు ఇచ్చినట్లు అసెంబ్లీలో పెద్ద ఎత్తున డప్పు కొట్టుకున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు రాజకీయంగా రాజ్యసభ ఎంపీల నుంచి సర్పంచ్ ల వరకూ అనేక పదవులు ఇచ్చింది వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమే. కానీ చంద్రబాబు మాత్రం 34 శాతం రిజర్వేషన్లు నేనే ఇస్తున్నా, దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ వాళ్లు కోర్టుకు వెళ్తారని చెబుతున్నారు. వాస్తవానికి 2019లో మేం అధికారంలోకి వచ్చాక వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గారు 34 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినప్పుడు కోర్టుకు వెళ్లింది మీ బిర్రు ప్రతాపరెడ్డా కాదా అని అడుగుతున్నాం. మేం జీవో ఇచ్చి బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే, కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. అయినా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గారు అప్పట్లో వెనక్కి తగ్గకుండా అంతకన్నా ఎక్కువ శాతం ఇస్తానని చెప్పి, బీసీలకు 50 శాతం రాజకీయ పదవులు ఇచ్చి చూపించారు. దీంతో ఇప్పుడు మరోసారి బీసీల్ని మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. తాను 34 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండానే వైయ‌స్ఆర్‌సీపీ కోర్టుకు వెళ్తుందని చెప్పడం చంద్రబాబు దురుద్దేశానికి నిదర్శనం. అంటే ఇప్పుడు 34 శాతం ఇస్తామని చెప్పి, తమ వాళ్లతో కేసులు వేయించి, తిరిగి దాన్ని 24 శాతానికి తగ్గించి అమలు చేయాలని అనుకుంటున్నారు. అప్పుడు మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీ కేసులు వేసింది కాబట్టి 24 శాతం రిజర్వేషన్లే ఇవ్వాల్సి వస్తోందని మాయమాటలు చెప్పేందుకు చంద్రబాబు ప్లాన్ రెడీ చేసుకున్నారు.

జగన్ ఇచ్చిన రిజర్వేషన్లు అడ్డుకుంది మీరేగా

గతంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గారు 24 శాతం రిజర్వేషన్ దాటకూడదని సుప్రీంకోర్టు చెప్పినా 34 శాతం కంటే కూడా పైన 50 శాతం రిజర్వేషన్ ను రాజకీయ పదవుల్లో ఇచ్చి చూపించారు. 25 మంది ఎంపీలుంటే అందులో  11 ఎంపీ సీట్లు ఇచ్చారు, రాజ్యసభలో సైతం మొదటిసారి నాలుగు ఎంపీలు ఇచ్చారు, 58 ఎమ్మెల్సీల్లో 28 మంది బీసీలకు అవకాశం కల్పించారు. 13 మేయర్లు ఉంటే 9 మంది బీసీలకు ఇచ్చారు. జిల్లా పరిషత్ ఛైర్మన్లు 13 ఉంటే 6 బీసీలకు ఇచ్చారు. మున్సిపల్ ఛైర్మన్లు 84 ఉంటే 44 బీసీలకు ఇచ్చారు. ఇలా చూసుకుంటే 40-60 శాతం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల పదవుల్ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీసీలకు ఇచ్చారు. పార్లమెంట్ లో 50 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రైవేటు బిల్లు పెట్టించిన ఘనత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిదే. మీరు ఒక్కసారి అయినా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇప్పుడు మొట్టమొదట వడ్డెర కులస్తులకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అసలు బీసీలకు ఈ విధంగా పదవులు ఇవ్వాలని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అంకురార్పణ చేస్తే, దాన్ని అమలు చేయక తప్పని పరిస్ధితి మీది. 2019కి ముందు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవుల్లో ఎంత మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో చూడాలి. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  హయాంలో దాదాపు 196లో 76 మంది బీసీలు మార్కెట్ యార్డ్ ఛైర్మన్లు అయ్యారు. వడ్డెరలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఓడిపోయినా ఏసురత్నం గారి రూపంలో మండలిలో స్ధానం కల్పించారు. చాలా చిన్న స్ధాయిలో ఉన్న వారికి కూడా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గారు ఊహించని పదవులు ఇచ్చారు. అంగన్ వాడీ కార్యకర్తను ఎమ్మెల్యేను చేశారు, చిన్న కార్యకర్త నందిగాం సురేశ్ ను ఎంపీని చేశారు. 2024 తర్వాత ఎంత మంది బీసీ నాయకుల్ని చంద్రబాబు జైల్లో పెట్టారో చూడాలి. 

బీసీ రిజర్వేషన్లపై మళ్లీ కోర్టుకు వెళ్లేదీ చంద్రబాబే

నిన్న కాక మొన్న సీదిరి అప్పలరాజు గారిని కొడుకు పొరబాటున చేసిన యాక్సిడెంట్ కేసులో జైలుకు పంపారు. నెల్లూరులో సంవత్సరం క్రితం ఓ దొంగ ఇసుక లారీ తీసుకెళ్తూ ఏడుగురు దళితుల్ని పొట్టనపెట్టుకుంటే బెయిలబుల్ కేసు పెట్టి వదిలేశారు. ఎందుకంటే ఆ దొంగ స్దానిక ఎంపీ మనిషి కాబట్టి. మా ఎమ్మెల్యే విరూపాక్షిపై కూడా దొంగకేసులు పెట్టారు. కారుమూరి సునీల్, జోగి రమేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ నాయకుల్ని చంద్రబాబు ఎన్నో అక్రమ కేసులతో వేధించారు. ప్రకాశం జిల్లాలో బీసీల్ని కులం పేరుతో తిడితే కేసు కట్టలేదు, అలాంటి వారు బీసీల రక్షణ గురించి మాట్లాడుతున్నారు. మీ పార్టీలో ఓ అన్యాయం జరిగితే అది రాష్ట్రమంతా బీసీలందరికీ జరిగినట్లు. ఇతరులకు జరిగితే మాత్రం వాళ్లే చేసినట్లు అన్నమాట. 50.7 శాతం బీసీలు ఉన్నారని మీరే చెప్తున్నారు, గతంలో బీసీలు జడ్డీలుగా పనికిరారని చంద్రబాబు లేఖ రాయలేదా ? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బీసీలు పనికిరారా అని అడుగుతున్నాం. మీ పార్టీకి గతంలో అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకి డిప్యూటీ సీఎం అయ్యే అర్హత లేదా ?, కళా వెంకట్రావు, పల్లా శ్రీనివాసరావు వంటి వారు కూడా కనిపించలేదా ? ఇంకో డిప్యూటీ సీఎం బీసీలకు ఇస్తే వారి స్దాయి తగ్గిపోతుందని అనుకుంటున్నారా ? బీసీలకు చంద్రబాబు ద్రోహం చేశారన్నది పచ్చి నిజం. ఓసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి డిప్యూటీ సీఎం పదవికి అర్హుడైనప్పుడు, నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలు అయిన బీసీలు ఆ పదవికి అర్హులు కారా ? బీసీల్ని చంద్రబాబు నిజంగా అవమానిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై కచ్చితంగా రేపు కోర్టుకు పోయేది చంద్రబాబే. తిరిగి వైయ‌స్ఆర్‌సీపీ వెళ్లిందని ఎదురుదాడి కూడా చేస్తాడు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గారు రాష్ట్రంలో బీసీలకు అత్యధిక పదవులు ఇచ్చి నెలకొల్పిన సంప్రదాయాన్ని చంద్రబాబు కూడా అమలు చేయక తప్పని పరిస్ధితుల్లో ఉన్నారు. వన్నికుల క్షత్రియులకు రెండు ఎమ్మెల్సీలు, వడ్డీలకు ఎమ్మెల్సీ ఇచ్చింది మేము. వెనుకబడిన కులాల వారికి వెతికి వెతికి పదవులు ఇచ్చింది వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారే. రేపు స్దానిక ఎన్నికల్లో చంద్రబాబు మోసాన్ని అందరూ చూడబోతున్నారు. 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారో లేక మోసం చేస్తారో అదే బీసీలు చూడబోతున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు బుద్దిచెప్పేందుకు బీసీలు సిద్దంగా ఉన్నారని అనిల్ కుమార్ యాదవ్ తేల్చిచెప్పారు.

Back to Top