పంచదార్లలో అక్రమ మైనింగ్‌ ను అడ్డుకోండి

చారిత్రక, సహజ సంపదను కాపాడండి

రాజ్యసభలో కేంద్రాన్ని కోరిన శ్రీ వైవీ సుబ్బారెడ్డి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఉన్న పంచదార్ల కొండల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, చారిత్రక సంపద నాశనం అవుతోందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (వైయస్సార్‌సీపీపీ) నేత శ్రీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు రాజ్యసభలో మాట్లాడిన ఆయన, పంచదార్లలో ఉన్న పురాతన ప్రదేశాలను, సహజ జలాశయాలను పరిరక్షించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఖనిజాల చట్ట సవరణ బిల్లు–2026పై చర్చ సందర్భంగా శ్రీ వైవీ సుబ్బారెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు.
    పంచదార్లలోని సంరక్షిత బౌద్ధ క్షేత్రానికి, పురాతన ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో జరుగుతున్న మైనింగ్‌ కార్యకలాపాలను ఆయన సభలో వివరించారు. ఆలయ సముదాయం గుండా ప్రవహించే ఐదు సహజ జలాశయాలతో పంచదార్ల గుర్తింపు ముడిపడి ఉందని శ్రీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రక్షిత వారసత్వ ప్రాంతానికి అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు మరింత సమీపానికి రావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాన్ని తక్షణమే తనిఖీ చేయాలని, పర్యావరణానికి కలుగుతున్న హాని పరిశీలించాలని, నీటి కాలువలపై శాస్త్రీయ జలవిజ్ఞాన అధ్యయనం చేయాలని కోరారు. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు పంచదార్ల ప్రాంతంలో మైనింగ్‌ కార్యకలాపాలన్నీ ఆపివేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    ఇక ఖనిజాల చట్ట సవరణ బిల్లుపై శ్రీ వైవీ సుబ్బారెడ్డి  మాట్లాడుతూ, ఖనిజ సంపద ప్రజలదేనని, దాని నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధికి స్పష్టమైన మైనింగ్‌ విధానం ముఖ్యమే అయినా, అది రాష్ట్ర ఆదాయాలు, స్థానిక జీవనోపాధి లేదా పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగించకూడదన్నారు. మైనింగ్‌ వల్ల తలెత్తే తక్షణ ఆర్థిక, పర్యావరణ, మౌలిక సదుపాయాల వ్యయాలను రాష్ట్రాలే భరిస్తాయని అన్నారు. అందువల్ల, మైనింగ్‌ విధానాలను రూపొందించేటప్పుడు వారి ప్రయోజనాలు, ఆదాయాలను కాపాడాలని శ్రీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Back to Top