కృష్ణా: తన చుట్టూ ఉన్నవారి భజనతో సరిపోక ఇప్పుడు ఖాకీ డ్రెస్‌లో ఉన్న పోలీసులతోనూ చంద్రబాబు భజన చేయించుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. సీఐలు, ఎస్పీలతో ముఖ్యమంత్రి నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం ఎప్పుడూ చూడలేదని, డీజీపీ అసమర్థత వల్లే చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారా అని ప్రశ్నించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులను రాజకీయంగా ఉపయోగించుకునేందుకే ఈ సమావేశాలా అని నిలదీశారు. పోలీసు వ్యవస్థను ఇప్పటికే భ్రష్టుపట్టించారని, ఇప్పుడు పోలీస్‌స్టేషన్ల స్థాయిలోనూ అదే పరిస్థితి తీసుకురావాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీ, ఆస్తులు, పదవులు లాక్కోవడమే చంద్రబాబు ధైర్యమా అని ప్రశ్నించారు. డాక్టర్ ప్రియాంక మృతి ఘటనను ప్రస్తావిస్తూ మహిళల భద్రతపై మాట్లాడే పవన్ కల్యాణ్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అమరావతి పేరుతో ప్రచారం తప్ప రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని, కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలని కోరారు. రూ.50 కోట్ల ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టండి.. బోండా ఉమకు పేర్ని నాని సవాల్ తనపై, తన భార్యపై రూ.50 కోట్లకు సంబంధించిన ఆరోపణలు చేస్తున్న బోండా ఉమా అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఫొటోలు, వీడియోలను బయటపెట్టాలని పేర్ని నాని సవాల్ చేశారు. తాను, తన భార్య రూ.50 కోట్లు ఇచ్చి ఉంటే తమను జైలులో పెట్టాలని, చంద్రబాబు తన వద్ద రూ.50 కోట్లు తీసుకుని ఉంటే ఆయనపైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. నోటికొచ్చినట్లు వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకోవాలని, రాజకీయ విమర్శలను వ్యక్తిగత కక్షల స్థాయికి దిగజార్చవద్దని స్పష్టం చేశారు.