ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సీసీ రోడ్డు శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటనను వైయస్ఆర్‌సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. శిలాఫలకం ధ్వంసమైన ప్రాంతాన్ని జంగారెడ్డిగూడెం మండల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర కుమార్ పరిశీలించి, ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓరుగంటి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల మదిలో నుంచి తొలగించాలనే రాజకీయ కక్షతోనే శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. శిలాఫలకాలను పగలగొట్టడం వల్ల ప్రజల కోసం నిర్మించిన రహదారులు, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల చరిత్ర చెరిగిపోదని స్పష్టం చేశారు. అభివృద్ధిపై పోటీ పడాలి... విధ్వంసంపై కాదు ప్రజలకు మరింత మెరుగైన అభివృద్ధి అందించడంలో పోటీ పడాల్సిన అధికార పార్టీ, గత ప్రభుత్వ పనుల ఆనవాళ్లను చెరిపివేయడానికే ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. ఇది అధికార పార్టీ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని, ప్రజలే ఇలాంటి చర్యలకు తగిన సమయంలో సమాధానం చెబుతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దోరెపల్లి సత్తిరాజు, బుడేకుల పాపారావు, పెదపూడి కేశవ్, సోం ప్రకాష్, జాన్ రాజు, పోల్నాటి చెల్లారావు, బల్లె పవన్, షఫీతో పాటు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.