భోగాపురం ఎయిర్ పోర్టులోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ

అంతటితో ఆగకుండా జగన్ పై దుష్ప్రచారాలా ?

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ 

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి

భోగాపురం విమానాశ్రయాన్ని స్వాగతిస్తున్నాం

క్రెడిట్ చోరీ చంద్రబాబుకు పాత అలవాటే

కేవలం విష ప్రచారాలపైనే మా అభ్యంతరం

గతంలో కడప స్టీల్ లో, ఇప్పుడు భోగాపురంలో 

సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపణ

ఎర్రబస్సు పేరుతో జగన్ పై అబద్ధాల ప్రచారం 

జగన్ అనని మాటల్ని అన్నట్లు వక్రీకరణలు

ఎయిర్ పోర్టుకు చంద్రబాబు హడావిడి భూమిపూజ

జగన్ హయాంలోనే 80 శాతం పనులు పూర్తి

సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

వైజాగ్ బీచ్ రోడ్డు విస్తరణకు జగన్ ప్రయత్నాలు

కేంద్రం నుంచీ అన్ని అనుమతులూ తెచ్చారు

కానీ జగన్ పై కక్షతో దాన్ని పక్కనబెట్టేసిన కూటమి

ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం

తేల్చిచెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో చంద్రబాబు మరోసారి తన క్రెడిట్ చోరీని బయటపెట్టుకున్నారని, జగన్మోహన్ రెడ్డి హయాంలో 80 శాతం పనులు పూర్తి చేస్తే, రెండేళ్లలో 20 శాతం పనులు చేసి, గొప్పలు చెప్పుకోవడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. క్రెడిట్ చోరీతో సరిపెట్టుకోకుండా, తిరిగి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌ గారిపై దుష్ప్రచారాలకు కూటమి నేతలు తెరలేపడంపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.  గతంలో జగన్మోహన్ రెడ్డి అనని మాటల్ని అన్నట్లుగా చూపించి విమర్శలకు దిగడం కూటమి నేతల దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్తారని చంద్రబాబు తెలుసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. 
    
భోగాపురంలో చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ 

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ ప్రారంభమైంది. దీనిపై కొన్ని రోజులుగా బాగా ప్రచారం జరుగుతోంది. అది మంచిదే. ఏపీకి సంబంధించిన మంచి బ్రాండ్ ఇది. మెట్రో నగరాలకు దీటుగా ఓ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇది జరిగింది. ముందు జరిగిన ప్రచారం, ఇవాళ జరిగిన ప్రారంభోత్సవం సరైన దిశలోనే జరిగాయి. దీన్ని అందరూ ఆహ్వానించాల్సిందే. అయితే దీనికి ముందు నెల రోజుల నుంచీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓ అబద్దపు ప్రచారం చేశారు. చంద్రబాబుకు సహజంగానే చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో వేసుకుంటాడు. హైదరాబాద్ నిర్మించానన్న ప్రచారం నుంచి మొదలుపెడితే భోగాపురం ఎయిర్ పోర్టు వరకూ ఇదే పరిస్ధితి. విభజన తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల క్రెడిట్ చోరీ చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. ఇప్పటికే కడప స్టీల్ క్రెడిట్ చోరీ చేశారు. ఇప్పుడు భోగాపురం విషయంలోనూ అదే చేశారు. క్రెడిట్ చోరీ చేసుకున్నా ఫర్వాలేదు కానీ విషప్రచారాలకు దిగడమే అభ్యంతరకరం. 

క్రెడిట్ చోరీ సరే, జగన్ పై దుష్ప్రచారం ఎందుకు ?

ప్రధాని మోడీ ఎయిర్ పోర్టు, అభివృద్ది గురించి మాట్లాడారు. కానీ ముగ్గురు ముఖ్యమంత్రుల్లో డమ్మీ సీఎం చంద్రబాబు, డీఫాక్టో సీఎం లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్గురి మాటల్లోనూ ఎర్రబస్సు కూడా రాదని ఎగతాళి చేశారని, తాము ఎయిర్ బస్ తెచ్చామని చెప్పుకున్నారు. వీరితో పాటు నాలుగో వ్యక్తి రామ్మోహన్ నాయుడు కూడా అవే మాటలు పలికారు.  అంతర్జాతీయ  విమానాశ్రయం ప్రారంభించేటప్పుడు అందుకు తగ్గ స్ధాయిలో మాటలు ఉండాలి. కానీ భోగాపురంలో ఇవాళ అవేవీ కనిపించలేదు. చంద్రబాబు నోట విధ్వంసం అనే మాటలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రబస్సు అనే మాటలు ఎప్పుడు అన్నారు, ఏ సందర్భంలో అన్నారో ఓసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అప్పట్లో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం వేల ఎకరాల భూమి సేకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రజల నుంచి నిరసన వచ్చిన క్రమంలో ఎర్రబస్సు మాటల్ని అక్కడ ఓ అమ్మాయి చెప్పింది. ఆమె అన్న దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమ్మాయి ఇలా అంటోందని ప్రస్తావించారు. కానీ దాన్ని వక్రీకరించి ఎర్ర బస్సు కూడా రాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు. కొబ్బరికాయ కొట్టిందీ, గుమ్మడికాయ కట్టిందీ తానేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కానీ అది ఎప్పుడు, 2019 ఫిబ్రవరిలో హడావిడిగా ఎన్నికలకు వెళ్తూ కొబ్బరికాయ కొట్టారు. దాన్ని దాదాపుగా పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎలాగో చేసేది క్రెడిట్ చోరీయే. దాన్ని కెలికి, లేపి, తన్నించుకోవడం ఎందుకనేదే మా ప్రశ్న. ఇక్కడ గత ప్రభుత్వం అనాల్సిన అవసరం లేదు. ఎయిర్ పోర్టు రావడం మంచి పరిణామం, ప్రారంభించడం నా అదృష్టం అని చెప్పుకుంటే సరిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఉండే హడావిడిగా దీన్ని ప్రారంభించే వారు. కానీ అలా చేయలేదు. భోగాపురం కూడా తన క్రెడిట్ చోరీ ఖాతాలో వేసుకోవాలన్న ఆరాటమే చంద్రబాబు మాటల్లో కనిపించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఆ రోజు ఏం మాట్లాడారు ? వేల ఎకరాలు అంటూ ఐదు శాతం కూడా ఉపయోగించడం లేదంటూ ఎస్ఈజడ్ ల గురించి మాట్లాడుతూ భోగాపురంలో అన్ని వేల ఎకరాల సేకరణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

భోగాపురం ఎయిర్ పోర్టు దాదాపు పూర్తి చేసిన జగన్ 

భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. పెద్ద ఎత్తున భూమి సేకరించి, అందులో వీలైనంత దోపిడీ చేయాలని అనుకోవడం వల్లే అప్పుడు ఈ ప్రాజెక్టుకు తెరలేపారు. ఎన్నికలు రావడంతో హడావిడిగా భూమిపూజ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్రం అనుమతులు తీసుకురావడంతో పాటు భూసేకరణ పూర్తి చేయడం, పనుల ప్రారంభం జరిగాయి. 2023లో మేం భోగాపురం పనులు మొదలుపెట్టి తర్వాత ఏడాది ఎన్నికలు వచ్చే నాటికి 80 శాతం పనులు పూర్తి చేశాం. రూ.1200 కోట్లతో భూసేకరణతో పాటు పునరావాసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. ఆ తర్వాత మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయడానికి చంద్రబాబుకు రెండేళ్లు పట్టింది. కోవిడ్ లేకపోతే 2020-21లో భోగాపురం ఎయిర్ పోర్టు మొదలుపెట్టేవాళ్లం. మా హయాంలోనే ఇది పూర్తయ్యేది కూడా. 2026 కల్లా భోగాపురంలో విమానాలు దిగుతాయని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధీమాగా చెప్పారు. అప్పటికే అన్ని అనుమతులు తీసుకొచ్చారు కాబట్టే ఆయన అంత ధీమాగా చెప్పగలిగారు. మరి ఈ క్రెడిట్ ఎవరికి రావాలి? 15 వేల ఎకరాలు కావాలని చంద్రబాబు చెప్తే.. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు 2300 ఎకరాల్లోనే దాదాపుగా దీన్ని పూర్తి చేయగలిగారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకురాకపోయినా ఫర్వాలేదు. నేనే అంతా చేశానని చంద్రబాబు విర్రవీగుతూ చెప్పుకోవడమే సహించరాని విషయం. 

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు చంద్రబాబూ.. 

జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించడంతో పాటు వైజాగ్ బీచ్ రోడ్డును కూడా 6 లేన్ గా విస్తరించేలా కేంద్రాన్ని ఒప్పించి సాధించుకున్నారు. ఆ విషయం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీయే చెప్పారు. ఇవాళ కూడా ఆయనే మంత్రిగా ఉన్నారు. కానీ ప్రధాని వస్తే విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లేందుకు దారి లేదు.  కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా ఈ రోడ్డు గురించి ఈ మధ్యే గుర్తుచేశారు. విశాఖపట్నం నుంచి భోగాపురానికి వెళ్లేందుకు రెండు గంటలు తీసుకుంటుందని, అక్కడి నుంచి విమానం కోసం గంటా, గంటన్నర ఎదురుచూడాలని, దానికి బదులు వందే భారత్ ఎక్కితే విజయవాడకు నాలుగు గంటల్లో వెళ్లిపోతామని చెప్పలేదా ? ఇంత జరిగినా బీచ్ రోడ్డు విస్తరణ గురించి పట్టించుకోలేదు. ప్రధాని సమక్షంలో అయినా ఈ రోడ్డు గురించి చెప్తారనుకుంటే అదీ చేయలేదు. ప్రధాని సమక్షంలో ఏం మాట్లాడాలో కూడా లోకేష్ కు తెలియడం లేదు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టాలో తెలియక అర్దమైందా రాజా అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. సంవత్సరంలో 80 శాతం ఎయిర్ పోర్టు  పనుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తే రెండేళ్లు తీసుకుని చంద్రబాబు పూర్తి చేశారు. దానికి చంద్రబాబు క్రెడిట్ తీసుకుంటే తీసుకోమనండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారెపై విమర్శలే అభ్యంతరకరంగా ఉన్నాయి. కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ఇలాగే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కాకముందే దాల్మియా సిమెంట్స్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒప్పిస్తే ఈ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. చంద్రబాబు మాత్రం ఈ స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు వచ్చిన  వారిపై తప్పుడు కేసులు పెట్టించారు. అమరావతికి వేల కోట్లు ఖర్చుపెడుతూ రాయలసీమలో తిరగాలంటే మొహం చెల్లక ఈ మధ్య హడావిడిగా దానికి మరోసారి శంఖుస్దాపన చేశారు. 
    వైజాగ్ లో చంద్రబాబు ఏం చేశారు ? 30 వేల కోట్ల విలువ చేసే భూములు 99 పైసలకే అప్పనంగా దోచిపెట్టారు. లోకేష్ తోడల్లుడు అయిన ఎంపీకే 5 వేల కోట్ల భూమి అప్పనంగా ఇచ్చేశారు. కొండ మీద ఉన్న హరిత రిసార్ట్  ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని భవనం నిర్మిస్తే.. విలాసవంతంగా కట్టేసుకున్నారని దుష్ప్రచారం చేశారు. అప్పుడు రుషికొండను బోడిగుండు చేశారని సెల్ఫీలు దిగిన వాళ్లే.. ఇవాళ వైజాగ్ లో ప్రతీ కొండనూ బోడిగుండు చేసేస్తున్నారు. దానికి మాత్రం సమాధానం చెప్పరు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. గుంటూరులో ముస్తఫాపై పెట్టిన కేసు, ఆముదాలవలసలో చింతాడ రవికుమార్ పై పెట్టిన కేసు ఇలాంటివే. మహిళా కానిస్టేబుల్ తో అసహ్యంగా కేసు పెట్టించారు. చంద్రబాబుకు మళ్లీ చెప్తున్నాం. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు అజ్ఞానాలు కాదు. అన్నీ గమనిస్తూనే ఉంటారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మీరేం చేశారో ప్రజలకు తెలుసు. కానీ మరీ ఇంత మోసమా అని జనం బాధపడుతున్నారు. జనం సరైన సమయంలో వారి తీర్పు ఇస్తారన్న విషయం చంద్రబాబు తెలుసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి చురకలు అంటించారు.

Back to Top