కర్నూలు: రాష్ట్రంలో జంగిల్ రాజ్, అటవిక పాలన నడుస్తోందని వైయస్ఆర్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్ ని ఖండిస్తూ చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద వైయస్ఆర్‌సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన యాక్టివ్ ఎమ్మెల్యే కాబట్టే పథకం ప్రకారం విరూపాక్షిపై కక్ష గట్టి ఈ వెన్నుపోటు ప్రభుత్వం కుట్రకు పాల్పడ్డారని మాజీ మేయర్ బీవై రామయ్య ఆరోపించారు. ప్రాణభయంతో ఉన్న వైయస్ఆర్‌సీపీ కార్యకర్త గిరిని కాపాడుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆయన తమ్ముడిపై టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేశాయని స్పష్టం చేశారు. దాడిలో ఎమ్మెల్యే తమ్ముడి చెయ్యి విరిగినప్పటికీ, బాధితులపైనే పోలీసులు 307 హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అర్ధరాత్రి వేళ ఐఎస్ఐ తీవ్రవాదుల తరహాలో ఇల్లు చుట్టుముట్టి, తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం పోలీసు వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే గంటల తరబడి కూర్చోబెట్టుకుని కంప్లైంట్ తీసుకోకుండా ఉల్టా వేధించారని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాల హార్డ్ డిస్క్‌లను పోలీసులు తీసుకెళ్లడం ద్వారా ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తను కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధిగా వెళ్లడం తప్పా అని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి నాయకులే స్వయంగా సైకోలుగా మారి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే విరూపాక్షి భార్య ప్రశ్నించారు. వెన్నుపోటు కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగం'లో భాగంగానే గట్టిగా ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి హింసిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైయస్ఆర్‌సీపీ శ్రేణులను భయాందోళనలకు గురిచేయడానికే ఈ నాటకాలాడుతున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆరోపించారు. ప్రమాద సమయంలో స్వయంగా ఎస్పీ, సీఐలకు ఫోన్ చేసినా స్పందించలేదని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తెలిపారు. ఎమ్మెల్యేను, ఆయన కుమారుడిని బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా ఈడ్చుకెళ్లడం పక్కా రాక్షస పాలనకు నిదర్శనమని ఎమ్మెల్సీ మధుసూదన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని, మరింత కసితో ప్రజాక్షేత్రంలో పోరాడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు, అరెస్ట్ చేసిన 15 మంది వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ అరెస్టులపై, పోలీసుల దౌర్జన్యాలపై న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ చట్టబద్ధంగా పోరాటం చేస్తామని వైయస్ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే... ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?: ఎమ్మెల్యే విరూపాక్షి భార్య కార్యకర్త ఆపదలో ఉన్నాడని సిఐకి ఫోన్ చేస్తే సిఐ స్పందించలేదు. సరే చచ్చిపోతాడేమో అని మా ఆయన వెళ్తే తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు. రాత్రి 11 గంటలకు కేసు విషయమై స్టేషన్‌కు వెళ్తే అర్ధరాత్రి వరకు అక్కడే ఉంచుకున్నారు. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చి పడుకున్నాక తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. వస్తున్నాం అని చెబుతున్నా వినకుండా దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఇంట్లో తోడు ఉంటాడని గుంతకల్లు నుంచి వచ్చిన మా అబ్బాయిని కూడా బలవంతంగా తీసుకెళ్లారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరించారు : కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వకుండా పోలీసులు రాత్రివేళ దొంగల మాదిరిగా, టెర్రరిస్టులను పట్టుకెళ్లినట్లు వచ్చి తలుపులు పగలగొట్టి తీసుకుపోవడం అత్యంత దుర్మార్గం. ఈ రోజు పోలీసులు తమ ధర్మాన్ని మర్చిపోయి టీడీపీ నాయకుల ఆదేశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బాధితులు కేసు పెట్టడానికి వెళ్తే కేసులు తీసుకోరు కానీ, దౌర్జన్యం చేసిన టీడీపీ వారి ఫిర్యాదుల ఆధారంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో మా క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేయాలనే ఈ విధంగా పోలీసులతో చేయిస్తున్నారు. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కార్యకర్తల్లో కసి పెరుగుతుందే తప్ప ఎవ్వరూ భయపడరు, 2029లో జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తాం. బాధితులనే నిందితులుగా చేసి కేసులు పెడుతున్నారు: సాకె శైలజానాథ్, మాజీ మంత్రి ఎవరైతే దెబ్బలు తిని, రాళ్లతో కొట్టించుకున్నారో వాళ్లపైనే తిరిగి పోలీసులు కేసులు పెట్టడం ఈ వెన్నుపోటు కూటమి ప్రభుత్వ దుర్మార్గమైన సిద్ధాంతానికి పరాకాష్ట. ఎమ్మెల్యే విరూపాక్షిని ట్రాప్ చేసి రప్పించడం కోసమే ముందస్తు పథకం ప్రకారం కార్యకర్తపై దాడికి తెగబడ్డారు. రాత్రి పిలిస్తే వచ్చే ఎమ్మెల్యేను అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి, హార్డ్ డిస్క్‌లు, సీసీ కెమెరాలు లాక్కెళ్లడం ఏ చట్టం కిందకు వస్తుందో పోలీస్ ఉన్నతాధికారులు ఆలోచించుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా వైఎస్సార్సీపీ నేతలు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు పోతే వాళ్లపైనే కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమం నడుస్తోంది. విరూపాక్షి పై పెట్టిన 307, అట్రాసిటీ తప్పుడు కేసులను తక్షణమే విరమించుకోవాలి, మేము న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ చట్టబద్ధంగా పోరాడతాం. సైకోలుగా తయారై రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు: సాయి ప్రసాద్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే ఒక కార్యకర్త ఆపదలో ఉండి 'అన్నా నువ్వు ఇప్పుడు రాకపోతే పొద్దున్న నా శవానికి వస్తావ్' అని ఫోన్ చేస్తే ఎమ్మెల్యేగా వెళ్లి పరామర్శించడం తప్పా అని అడుగుతున్నాను. నిన్నటివరకు సైకో జగన్ అన్న కూటమి నాయకులే ఇవాళ నిజమైన సైకోలుగా తయారై రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. రెండేళ్ల పరిపాలనలో ఎక్కడా అభివృద్ధి లేదు, దోచుకోవడం దాచుకోవడం తప్పిస్తే వేరేది లేదు. ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడి చెయ్యి విరిగితే మా వాళ్లపైనే తిరిగి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, 307 హత్యాయత్నం కేసులు బనాయించి జైలుకు పంపాలని చూస్తున్నారు. ఇష్టానుసారంగా బెదిరిస్తే బెదిరిపోయే నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో ఎవరూ లేరు, మా పార్టీ శ్రేణులకు మేమందరం అండగా ఉంటాం. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి హింసిస్తున్నారు: కంగాటి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తూ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అక్రమంగా అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య. కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే గట్టిగా మాట్లాడే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి హింసిస్తున్నారు. నన్ను రక్షించండి అని కార్యకర్త వేడుకుంటే వెళ్లిన ఎమ్మెల్యేను రాత్రివేళ పోలీసులు పరామర్శకు వెళ్లిన చోటే కాదు, ఇంట్లోనే ఉంటే అర్ధరాత్రి దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగనన్నకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కార్యకర్తల్లో భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారు. ఎన్ని అరెస్టులు చేసినా వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, నాయకులు దేనికీ భయపడరు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఎమ్మెల్యేపై కుట్ర : బుట్టారేణుక, మాజీ ఎంపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారి అరెస్ట్ పక్కా ప్రీ-ప్లాన్డ్, ఫ్యాబ్రికేటెడ్ కుట్ర. రాత్రివేళ టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటికి వెళ్లి కొడుతుంటే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశారు. సర్దిచెప్పడానికి వెళ్లిన ఎమ్మెల్యే గారి తమ్ముడి చెయ్యి విరగొట్టారు. వీళ్లు ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్తే గంటల తరబడి కూర్చోబెట్టుకుని ఫిర్యాదు తీసుకోకుండా ఉల్టా వీళ్లపైనే కేసులు పెట్టారు. అర్ధరాత్రి ఉగ్రవాదుల కంటే దారుణంగా తలుపులు విరగొట్టి తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు చాలా బలమైన వారు, ఇటువంటి బెదిరింపులకు వంగరు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?: మధుసూదన్, ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన, రాక్షస పాలన సాగుతోంది. ఆలూరు నియోజకవర్గానికి చెందిన బడుగు, బలహీన వర్గాల శాసనసభ్యులు విరూపాక్షి గారిని ఒక ఐఎస్ఐ తీవ్రవాదిలాగా తెల్లవారుజామున అరెస్ట్ చేయడం హాస్యాస్పదం. కార్యకర్తను కాపాడుకోవడానికి వెళ్లి రాజీ చేద్దామనుకుంటే ప్రీ-ప్లాన్డ్‌గా దాడి చేశారు. రాత్రి 12 గంటల వరకు స్టేషన్‌లో ఉండి ఇంటికి వచ్చాక, తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది? కూటమి పాలనలో వైఎస్సార్సీపీని ఏ రకంగా దెబ్బతీయాలని చూస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. జగన్ గారు ఎల్లప్పుడూ కార్యకర్తలకు వెన్నంటి ఉంటారు, ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌తో పాటు అరెస్ట్ చేసిన 15 మందిని వెంటనే విడుదల చేయాలి. ఎస్పీకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు : ఇసాక్ బాషా, ఎమ్మెల్సీ వెన్నుపోటు కూటమి ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందో అనడానికి విరూపాక్షి గారిపై పెట్టిన అక్రమ కేసులే నిలువెత్తు నిదర్శనం. ప్రమాదంలో ఉన్న కార్యకర్తను కాపాడుకోవడానికి ఎస్పీకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ కాకపోవడం వల్లే ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లి నచ్చజెబుతున్న ఎమ్మెల్యేపై పథకం ప్రకారం రాళ్లు, కర్రలతో దాడి చేసి, తిరిగి ఎమ్మెల్యే తమ్ముడి చెయ్యి విరగొట్టి మళ్లీ మా వాళ్లపైనే 307 మరియు అట్రాసిటీ కేసులు పెట్టడం రెడ్ బుక్ రాజ్యాంగం కాకపోతే మరేంటి? అర్ధరాత్రి 2:30 నుండి 3:00 గంటల మధ్య తలుపులు పగలగొట్టి బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా తీసుకెళ్లడం పక్కా రాక్షస పాలన. వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టాలనుకుంటే డబుల్ ఫోర్స్‌తో ఎదుర్కొంటాం, రాబోయే రోజుల్లో వీటికి రెట్టింపు స్థాయిలో సమాధానం చెప్తాం. బీసీ ఎమ్మెల్యే కాబట్టే కక్ష కట్టారు : బీవై రామయ్య, మాజీ మేయర్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని నిన్న రాత్రి ప్రీ-ప్లాన్డ్‌గా, కుట్రపూరితంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. బీసీ ఎమ్మెల్యే, చాలా యాక్టివ్‌గా ఉన్నాడనే ఉద్దేశంతో కక్ష గట్టి ఈ విధంగా చేశారు. తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఒక వైఎస్సార్సీపీ కార్యకర్త ఫోన్ చేస్తే, ఒక ప్రజాప్రతినిధిగా సపోర్ట్‌గా నిలబడటానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆయన తమ్ముడిపైనే టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఎమ్మెల్యే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే రాత్రి 11 గంటల వరకు అక్కడే కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంటికొచ్చి పడుకుంటే, తెల్లవారుజామున 3 గంటలకు ఏదో ఐఎస్ఐ తీవ్రవాదిని బంధించినట్లు పోలీసులు ఇళ్లంతా చుట్టుముట్టి తలుపులు పగలగొట్టి తీసుకుపోయారు. ఈ తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తి ఏ వైఎస్సార్సీపీ కార్యకర్తకు లేదు.