న్యూఢిల్లీ, ఆగస్టు 4: జనన–మరణాల నమోదు (సవరణ) బిల్లు–2026పై రాజ్యసభలో జరిగిన చర్చలో వైయస్ఆర్‌సీపీ తరఫున ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి మాట్లాడారు. గ్రామీణ, పేద, గిరిజన ప్రజలకు సులభంగా సేవలు అందేలా బిల్లులో మరిన్ని ప్రజానుకూల నిబంధనలు చేర్చాలని సూచించారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో గ్రామ సచివాలయ–వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే జనన–మరణాల నమోదు సేవలు అందించిన విధానాన్ని గుర్తుచేస్తూ, అదే తరహా ప్రజా కేంద్రిత నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. గ్రామ సచివాలయాల ద్వారానే డిజిటల్ సేవలు అందించాలి జనన, మరణాల ఆలస్య నమోదు దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే డిజిటల్ విధానంలో స్వీకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు. అలాగే బీపీఎల్ కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఆలస్య నమోదు రుసుములు, కోర్టు ఛార్జీలను పూర్తిగా మినహాయించాలని కోరారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించి ప్రజలకు సులభంగా సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి కాకుండా, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లే పరిపాలనా విధానం అవసరమని మేడా రఘునాథ్‌రెడ్డి అన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన గ్రామ సచివాలయ–వాలంటీర్ వ్యవస్థ అందుకు ఆదర్శమని పేర్కొంటూ, అలాంటి నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.