మంత్రి గుమ్మడి సంధ్యారాణికి శాఖపై కనీస అవగాహన లేదు

వైయ‌స్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం :
 
మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి మండిపాటు. 

తాడేపల్లి : వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులకు తమ స్వంత శాఖలపై కనీస పట్టు, పరిజ్ఞానం లేవని, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వైఎస్. జగన్‌పైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏమన్నారంటే.... 

"భోగాపురం ఎయిర్‌పోర్ట్ శ్రేయస్సు వైఎస్ జగన్ సంకల్పమే". 

"కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 15,000 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ కట్టాలని ప్లాన్ చేసి, దిబ్బలపాలెంలో శంకుస్థాపన శిలాఫలకం వేసి వదిలేశారు. కానీ, రైతులు నష్టపోకూడదని వైఎస్. జగన్  2,700 ఎకరాల్లోనే ల్యాండ్ అక్విజిషన్ చేసి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి, రూ. 1,200 కోట్లు ఖర్చు పెట్టి అన్ని రకాల అనుమతులు తెచ్చారు."
"2026 నాటికి ఎయిర్‌పోర్ట్ పూర్తి కావాలని ఆ రోజే సంకల్పించారు. అందులో భాగంగా పనులు పూర్తయితే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఓపెన్ చేశారు తప్ప, ఈ ప్రాజెక్టులో మీకు 1% కూడా క్రెడిట్ దక్కదు. వైఎస్. జగన్  క్రెడిబిలిటీ ఏంటో కాంట్రాక్టర్  గ్రంధి మల్లికార్జున రావు గారిని అడిగితే తెలుస్తుంది."

"అల్లూరి సీతారామరాజుకు అసలైన గౌరవం ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే"

"అల్లూరి సీతారామరాజు గారి పేరును ఎవరూ ఎగతాళి చేయలేదు. ఆయనకు నిజమైన గౌరవం ఇచ్చింది వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజూ అల్లూరి పేరును స్మరించలేదు. జగన్ గారు ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడమే కాకుండా, భీమవరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఘనంగా వేడుకలు నిర్వహించారు."
"దింసా నృత్యం సాంప్రదాయాన్ని అవహేళన చేశారని మేధావులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, దానికి ముందు సమాధానం చెప్పండి. పిల్లలకు జ్వరాలు వస్తే నాదా బాధ్యత అన్న మీరు, ఇప్పుడు క్రెడిట్ మాత్రం మీది అని చెప్పుకోవడం హాస్యాస్పదం."

"కూటమి ప్రభుత్వంలో చట్టాలు, న్యాయం మనుషులను బట్టి మారుతున్నాయా?"  

"మాజీ మంత్రి సీదరి అప్పలరాజు  విషయంలో జరిగింది అనుకోకుండా జరిగిన ప్రమాదం. ఘటన జరిగిన వెంటనే అప్పలరాజు గారి కుమారుడే  108కి ఫోన్ చేశాడు. కానీ బి ఎన్ ఎస్106(1) కింద నమోదు చేయాల్సిన కేసును, రాజకీయ కక్షతో హత్య కేసుగా చిత్రీకరిస్తే కోర్టు కూడా మిమ్మల్ని చివాట్లు పెట్టింది."

"ఇచ్చాపురం ఎమ్మెల్యే గారి కార్ యాక్సిడెంట్‌లో వృద్ధుడు చనిపోతే ఏం కేసులు పెట్టారు?
 పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్‌పై కేసు పెట్టలేదా? కురుపాం జనసేన ఇంచార్జ్ స్వయంగా డ్రైవ్ చేస్తూ హరిప్రసాద్ అనే యువకుడిని ఢీకొట్టి చంపేస్తే ఆయనపై పెట్టిన కేసు ఏంటి? ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారా? ఎస్టీ కమిషన్ మెంబర్‌గా తొలగించారా?

వైసార్సీపీ నేత చింతాడ రవికుమార్, గరుగుబిల్లి తేజశ్వరరావు వంటి వారిపై మాత్రం తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. 

"అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ.... మీ నాయకులకు ఒక న్యాయం, ప్రతిపక్షాలకు మరో న్యాయం వర్తింపజేస్తూ తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమని  పుష్ప శ్రీవాణి మండిపడ్డారు.

Back to Top