నంద్యాల: రాయలసీమ సాగునీటి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచాలని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలించడంలో భాగంగా నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్, అవుకు టన్నెల్, అవుకు రిజర్వాయర్‌లను వైయస్ఆర్‌సీపీ నేతలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. రాయలసీమకు జరిగిన అన్యాయం ఆగాలి రాయలసీమ ఎప్పటి నుంచో కరువు, నీటి కొరతతో పోరాడుతున్న ప్రాంతమని శైలజానాథ్ అన్నారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో గత ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, హంద్రీ–నీవా పనులకు వేగం వచ్చిందని, ఆ కృషి ఫలితంగానే కృష్ణా జలాలు రాయలసీమకు చేరాయని గుర్తు చేశారు. అయితే 2014 తర్వాత ప్రాజెక్టుల పురోగతి మందగించి రైతులకు ఆశించిన స్థాయిలో సాగునీరు అందలేదని అన్నారు. సీమ హక్కుల కోసం అందరూ గళం విప్పాలి రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే గ్రేటర్ రాయలసీమలోని కరువు ప్రాంతాలకు శాశ్వత ఉపశమనం లభిస్తుందని శైలజానాథ్ పేర్కొన్నారు. శ్రీశైలం జలాల వినియోగం, రాయలసీమ హక్కుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఎన్జీటీ అనుమతుల పేరుతో ప్రాజెక్టును ఆలస్యం చేయకుండా అవసరమైన చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకుని వెంటనే పూర్తి చేయాలని కోరారు. రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులంతా పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రాంత ప్రయోజనాల కోసం గళం విప్పాలని, లేకపోతే సీమ హక్కులను కాపాడాల్సిన సమయంలో మౌనం వహించిన నాయకులుగా చరిత్రలో మిగిలిపోతారని హెచ్చరించారు.