ప్రజాస్వామ్య పరిరక్షణకు చైతన్యవంతమైన సమాజమే బలం

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తున్న ప్రభుత్వం

డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలి

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: ప్రజాస్వామ్యంలో చట్టాలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే దాన్ని సరిదిద్దే బాధ్యత చైతన్యవంతమైన సమాజంపై ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని శ్రీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు, ప్రజా సంపదపై పాలకులకు యాజమాన్య హక్కు లేదని, ప్రజల తరఫున ట్రస్టీలుగా మాత్రమే వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. అధికార అహంకారంతో చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

 డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత ఎక్కడ?

డీఎస్సీ–2025 నియామకాల ప్రక్రియలో ముందుగానే కొందరికి అనుకూలంగా నిబంధనలు మార్చి, ప్రత్యేక జీవోలు జారీ చేయడం ద్వారా అక్రమాలకు మార్గం సుగమం చేశారని ధర్మాన ఆరోపించారు. అర్హత, మెరిట్‌ను పక్కనబెట్టి నియామకాలు చేపట్టిన తర్వాత అదే జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ద్వారా తప్పును పరోక్షంగా అంగీకరించినట్లైందన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 విద్యే సమ సమాజ నిర్మాణానికి పునాది

పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని, అనంతరం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో సంస్కరణలు చేపట్టి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే దిశగా పనిచేశారని ధర్మాన పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యా సంక్షేమ పథకాలను బలహీనపరుస్తూ సమాన అవకాశాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులు, విద్యార్థుల భవిష్యత్తు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం యువత, మేధావులు ముందుకు వచ్చి అన్యాయాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
 

Back to Top