పంచదారల కొండపై కూటమి ‘అనకొండల’ వికృత రూపం:

రూ. 200 కోట్ల గ్రావెల్ దోపిడీపై కలెక్టర్‌ను సస్పెండ్ చేయాల్సిందే :

మాజీ ప్రభుత్వ విప్, వైయస్సార్సీపీ యలమంచలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ డిమాండ్. 

విశాఖపట్నం వైయస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ప్రభుత్వ విప్, యలమంచలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ.

పంచదారల కొండపై ఘోర దోపిడీ

రూ. 200 కోట్ల మైనింగ్ దందా

ఆధారాలతో సహా ప్రశ్నిస్తే చిన్న ఉద్యోగులపై బ్రహ్మాస్త్రాలా?

అధికార పార్టీ నేతల బినామీ లీజులు రద్దు చేయాలి

రిత్విక్ కంపెనీపై క్రిమినల్ కేసులు చేయాలి

లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు

ప్రభుత్వాన్ని హెచ్చరించిన కరణం ధర్మశ్రీ.

విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన పంచదారల కొండపై కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మరియు నేతల అండదండలతో రూ. 200 కోట్లకు పైగా విలువైన గ్రావెల్ దోపిడీకి గురైందని వైఎస్సార్‌సీపీ యలమంచలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి పర్యావరణ, దేవాదాయ శాఖ ముందస్తు అనుమతులు లేకుండా బినామీల పేర్లతో లీజులు పొంది, అనుమతించిన పరిమితికంటే భిన్నంగా కొండలను పిండి చేస్తూ లక్షలాది టన్నుల మట్టిని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు నెలవారీ మామూళ్లు అందుతుండడం వల్లే ఈ అక్రమ రవాణా నిరంతరాయంగా సాగుతోందని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో విజయ్ కుమార్ నాయుడు, వై. శ్రీనివాస్ అనే లీజ్ హోల్డర్లు మరియు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీ ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని తేల్చి చెప్పారు. ఈ అక్రమ దందాపై వందలాది ఫిర్యాదులు చేసినా పట్టించుకోని జిల్లా కలెక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేయడమే కాకుండా, బలిపశువులైన చిన్న ఉద్యోగులను కాకుండా అసలు 'గెద్దల'పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, 32 కిలోమీటర్ల పంచదారల కొండ ప్రాంతాన్ని వెంటనే "నో మైనింగ్ జోన్" గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..

పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వద్దు.. దోపిడీ ‘గెద్దల’పై చర్యలు తీసుకోండి!..

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదారల గ్రామంలోని 32 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రంపై గత ఏడాది డిసెంబర్ నుంచే ఇష్టారాజ్యంగా మైనింగ్ దందా సాగుతోంది. ఈ అక్రమ క్వారీయింగ్‌పై కలెక్టర్, విజిలెన్స్, పోలీసు అధికారులకు లారీ నంబర్లు, డ్రైవర్ల వివరాలు మరియు విజువల్స్‌తో సహా ఏడెనిమిది సార్లు ఫిర్యాదు చేసినా 'నోటెడ్' అని చెప్పడం తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు చిన్న చిన్న ఉద్యోగులు బలిపశువులవుతున్నారు. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు సంధించడం కాదు, ఈ దోపిడీ వెనుకున్న అసలు 'గెద్దల'పై క్రిమినల్ కేసులు పెట్టాలి..

రూ. 200 కోట్ల దోపిడీ: రిత్విక్ కంపెనీ ద్వారా బార్క్ కు తరలింపు... 

సర్వే నంబరు 1లో కేవలం 2 హెక్టార్ల విస్తీర్ణానికి విజయ్ కుమార్ నాయుడు (దశమనాయని) కి మే 2026లో వర్క్ ఆర్డర్ వస్తే, దానికి ముందే డిసెంబర్ 2025 నుంచే అక్కడ క్వారీయింగ్ మొదలుపెట్టారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అనుమతి ఉన్న ప్రాంతం కాకుండా దానికి ఆనుకుని ఉన్న కొండను తవ్వేసి, అధికారుల జాయింట్ సర్వే రిపోర్టు ప్రకారమే 1,67,286 నుండి 2,02,000 మెట్రిక్ టన్నుల గ్రావెల్‌ను అక్రమంగా తోడేశారు. టన్నును రూ. 1,180 చొప్పున విక్రయిస్తూ బార్క్ (BARC) సంస్థకు తరలించారు. ఈ ట్రాన్స్‌పోర్ట్ అంతా సీఎం రమేష్‌కి చెందిన 'రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్' ద్వారానే జరిగింది. ఇలా రెండు నెలల్లోనే రూ. 200 కోట్లకు పైగా విలువైన పబ్లిక్ ప్రాపర్టీని అడ్డంగా మింగేశారు.

బినామీల పేరుతో 10 ఏళ్ల లీజులు – దేవుడి కొండపై కూటమి కన్ను.

ఒకవైపు సర్వే నం. 1 లో విజయ్ కుమార్ నాయుడుతో దోపిడీ చేయిస్తుంటే, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే బినామీ అయిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ వాసి వై. శ్రీనివాస్ పేరుతో సర్వే నంబర్ 156/P లో ఏకంగా 10 ఏళ్లకు లీజ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ధర్మలింగేశ్వర స్వామి ఉన్న ఈ పవిత్ర కొండపై పర్యావరణ క్లియరెన్స్ గానీ, దేవాదాయ శాఖ అనుమతులు గానీ లేవు. కొండను పైకి 150 అడుగుల మేర నిలువునా తవ్వేశారు. కూటమి నాయకులు ఎక్కడ కొండలు కనిపిస్తే అక్కడ కన్నాలు పెట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. అన్నవరం దేవస్థానం కొండ వద్ద, అలాగే సింహాద్రి అప్పన్న కొండ వద్ద కూడా ఇదే తరహాలో గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ దివ్య క్షేత్రాల పవిత్రతను భంగపరుస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ తరఫున ప్రభుత్వం ముందుంచుతున్న ప్రధాన డిమాండ్లు:

 ఈ నేపధ్యంలో అక్రమ క్వారీయింగ్ జరుగుతోందని తెలిసినా ఉపేక్షించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి లేదా రాజీనామా చేయించాలి. విజయ్ కుమార్ నాయుడు మరియు వై. శ్రీనివాస్‌ల లీజ్ ఆర్డర్లను వెంటనే రద్దు చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమ రవాణాకు పాల్పడిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ నుంచి, లీజ్ హోల్డర్ల నుంచి దోచుకున్న రూ. 200 కోట్లకు పైగా జరిమానా వసూలు చేయాలి. పాండవుల అజ్ఞాతవాసం, పంచ ధారల పవిత్రత ఉన్న ఈ 32 కిలోమీటర్ల పంచదారల కొండ ప్రాంతాన్ని తక్షణమే అధికారికంగా "నో మైనింగ్ జోన్" గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. 

మరోవైపు  కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా, సాంకేతిక ఆధారాలతో సహా వారి అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని.. ప్రభుత్వం ఈ విషయమై కాలయాపన చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజాపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Back to Top