ఎమ్మెల్యే విరూపాక్షిని బేష‌ర‌తుగా విడుద‌ల చేయాలి

వారిపై దాడి చేసిన టీడీపీ నాయ‌కుల‌పై త‌క్ష‌ణం కేసు పెట్టాలి

మ‌ల‌సాని మ‌నోహ‌ర్ రెడ్డి డిమాండ్ 

ఆలూరు ఘ‌ట‌న అరాచ‌క పాల‌న‌కు పరాకాష్ట‌

ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేకే రాష్ట్రంలో రక్షణ లేదు 

ప్రజా పరిపాలన బదులు అటవిక రాజ్యం, జంగిల్ రాజ్ నడుస్తోంది

పోలీసులే నేరస్తుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తూ ఆధారాలను ధ్వంసం చేస్తున్నారు

స్థానిక సంస్థ‌ల ఎన్నికల నేప‌థ్యంలోనే వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై దాడులు

వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీసే కుట్ర‌లో భాగమే ఎమ్మెల్యేపై దాడి 

స్ప‌ష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌ల‌సాని మ‌నోహ‌ర్ రెడ్డి

తాడేప‌ల్లి: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ ను వెంటనే బేషరతుగా విడుదల చేయడంపాటు.. ఎమ్మెల్యే విరూపాక్షి, వైయ‌స్ఆర్‌సీపీ నేత గిరి ఇంటిపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు నాగరాజుతో సహా నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌ల‌సాని మ‌నోహ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులకు ఒక చట్టం, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులకు మరో చట్టం అమలు చేస్తున్నారని,  చంద్రబాబు నీడలో పోలీసులను కక్షసాధింపులకు ఉపయోగిస్తూ, ప్రభుత్వ అక్రమాలకు రక్షకులుగా మార్చేశారని మండిప‌డ్డారు. ప్రజలచే ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడుంటుంది?" అని ప్ర‌శ్నించారు. "ఎమ్మెల్యే ఇంటి నుంచి పోలీసులు తీసుకెళ్లిన సీసీటీవీ హార్డ్ డిస్కులను న్యాయస్థానం పర్యవేక్షణలో భద్రపరచాలని, అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి చేసిన అరెస్ట్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి దృశ్యాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని వెన్నుపోటు కూట‌మి ప్ర‌భుత్వం చూస్తోంద‌ని, అది వారి భ్రమ అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. పోలీసులే నేరస్తుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తూ ఆధారాలను ధ్వంసం చేసే ('స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్') ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. "ఇక్కడ అమలవుతున్నది భారత రాజ్యాంగమా లేక లోకేష్ 'రెడ్ బుక్ రాజ్యాంగమా?" అని మ‌నోహ‌ర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే....

రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పరిపాలన బదులు అటవిక రాజ్యం, జంగిల్ రాజ్ నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తి రాక్షస పాలన. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తే అధికారులను ఎంచుకుని పాలిస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇవాళ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా శ్రేణులను, జర్నలిస్టులను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాజ్యాంగబద్ధమైన పాలన ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రమంతా అరాచకం, నిరంకుశత్వం, పోలీసు రాజ్యం రాజ్యమేలుతున్నాయి.

తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు

గతంలో అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారి ఇళ్లపై దాడులు చేశారు. ఇటీవల మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని జైల్లో ములాఖ‌త్‌లో కలవడానికి వెళ్తే, ఎలాంటి సంఘటన జరగకపోయినా ఒక మహిళా ఎస్ఐతో ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చి తప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు. ఆముదాలవలస వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్‌తో పాటు 20 మందిపై కేసులు పెట్టారు. ఇందులో విచిత్రమేమిటంటే... కేసులో నిందితుడిగా చేర్చిన అడ్వకేట్ దాన్నేటి రామ్మోహన్ రావు ఆ రోజు ఆముదాలవలస కోర్టులో ఉన్నారు. ఇంకొక వ్యక్తి తేజస్వి రావు ఢిల్లీలో ఉన్నారు. అయినా వాళ్లపై అక్రమ కేసులు బనాయించారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బాధితులు అయితే... బాధితులపైనే కేసులు పెట్టి అర్ధరాత్రి పూట వందల మంది పోలీసులు వెళ్లి టెర్రరిస్టులను చూసినట్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వినుకొండలో సోషల్ మీడియా కార్యకర్తలను సివిల్ డ్రెస్సుల్లో రౌడీల్లా వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులకు నేమ్‌బోర్డులు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ ఉల్లంఘిస్తున్నారు. తాడిపత్రిలో మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డిపై దాడి చేశారు. స్కార్పియోతో గుద్ది, కాళ్లు చేతులు విరగ్గొట్టి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులకు ఒక చట్టం, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులకు మరో చట్టం అమలు చేస్తున్నారు. చంద్రబాబు నీడలో పోలీసులను కక్షసాధింపులకు ఉపయోగిస్తూ, ప్రభుత్వ అక్రమాలకు రక్షకులుగా మార్చేశారు.

ఆలూరు ఘటన అరాచకానికి పరాకాష్ట 

నిన్న రాత్రి జరిగిన సంఘటన ఈ అరాచక పాలనకు పరాకాష్ట. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి బలహీన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధి. ఆయనను, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసిన తీరు అత్యంత దుర్మార్గం. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు గిరి ఇంటిపై టీడీపీ నాయకుడు నాగరాజు, ఆయన అనుచరులు దాడి చేశారు. గిరి ఫోన్ చేసి "అన్నా నన్ను రక్షించండి" అని వేడుకుంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. ఎమ్మెల్యే వస్తున్నాడని తెలుసుకుని టీడీపీ గుండాలు విరూపాక్షి గారిపై, ఆయన తమ్ముడు శ్రీరాములుపై రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో శ్రీరాములు చెయ్యి విరిగింది. 

బాధితులపైనే కేసులు, అర్ధరాత్రి అరెస్ట్ 

దాడి చేసిన టీడీపీ నాయకుడు నాగరాజుపై కానీ, ఆయన అనుచరులపై కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను, ఆయన కుమారుడిని అర్ధరాత్రి పూట తలుపులు పగలగొట్టి, టెర్రరిస్టుల తరహాలో అరెస్ట్ చేసి చిప్పగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కనీసం ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, నోటీసు ఇవ్వలేదు, అరెస్ట్ మెమో ఇవ్వలేదు. స్థానిక సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ, ఎమ్మెల్యే నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాల హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులే నేరస్తుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తూ ఆధారాలను ధ్వంసం చేసే ('స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్') ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అమలవుతున్నది భారత రాజ్యాంగమా లేక లోకేష్ 'రెడ్ బుక్ రాజ్యాంగమా'? ప్రజలచే ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడుంటుంది?

ఎమ్మెల్యేను బేష‌ర‌తుగా విడుద‌ల చేయాలి

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. ఎమ్మెల్యే విరూపాక్షి, వైయ‌స్ఆర్‌సీపీనేత గిరి ఇంటిపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు నాగరాజుతో సహా నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే ఇంటి నుంచి పోలీసులు తీసుకెళ్లిన సీసీటీవీ హార్డ్ డిస్కులను న్యాయస్థానం పర్యవేక్షణలో భద్రపరచాలి. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి చేసిన అరెస్ట్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి దృశ్యాలను ప్రజల ముందు ఉంచాలి. చిప్పగిరిలోవైయ‌స్ఆర్‌సీపీనాయకులకు, కార్యకర్తలకు, వారి కుటుంబాలకు తగిన భద్రత కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలపై పెడుతున్న అక్రమ కేసులు, అర్ధరాత్రి అక్రమ అరెస్టులను తక్షణమే నిలిపివేయాలి.

వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీసే కుట్ర 

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే. రెట్టింపు ఉత్సాహంతో వీటన్నింటినీ ఎదుర్కొంటాం. చంద్రబాబు, హోంమంత్రి.. పోలీసులకు ఖాకీ చొక్కాలకు బదులు అధికారికంగా పసుపు చొక్కాలు తొడిగేలా అసెంబ్లీలో ఒక చట్టం చేయండి! అంతగా పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ అక్రమ అరెస్టులపై, సీసీటీవీ హార్డ్ డిస్క్‌ల అపహరణపై మేము ఊరుకోం. ఆధారాలు సేకరించి అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులపై కోర్టులలో ప్రైవేట్ కేసులు వేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.

Back to Top