మున్సిపల్ ఎన్నికలకు శంఖారావం

"గడపగడపకు వైయస్ఆర్" కార్యక్రమానికి శ్రీకారం

రామచంద్రపురంలో ఇంటింటికీ ప్రచారం ప్రారంభించిన పిల్లి సూర్యప్రకాశ్

 రామచంద్రపురం : రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైయస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. "గడపగడపకు వైయస్ఆర్" కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ, ప్రజల వద్దకు నేరుగా వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించే ప్రచారాన్ని పార్టీ ప్రారంభించింది. రామచంద్రపురం పట్టణంలోని శీలంవారి సావరం 6వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జరిగిన వైఫల్యాలను వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తూ, ప్రభుత్వ పనితీరును వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని పిల్లి సూర్యప్రకాశ్ ప్రజలను కోరారు. ఇంటింటికీ ప్రచారం ద్వారా ప్రజలతో మరింత ఆత్మీయంగా మమేకమవుతూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
 

Back to Top