వైదిక సంప్రదాయాలకు తిలోదకాలు

కరువు పరిస్థితుల్లోనూ వరుణయాగం నిర్వహించాలన్న ఆలోచన లేదా?

మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి 

తిరుప‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలన, వైదిక కార్యక్రమాల నిర్వహణపై మాజీ టీటీడీ చైర్మన్‌, వైయ‌స్ఆర్‌సీపీ  నేత భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రెండున్నరేళ్లుగా టీటీడీకి ‘చంద్రగ్రహణం’ పట్టినట్టుగా పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని, తిరుమల కొండపై జలాశయాలు ఎండిపోతున్నప్పటికీ వర్షాల కోసం వరుణయాగం నిర్వహించాలన్న ఆలోచన కూడా టీటీడీకి లేకపోవడం బాధాకరమన్నారు.

కరువు పరిస్థితుల్లో వరుణయాగం నిర్వహించాలి

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆధ్వర్యంలో అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించిన విషయాన్ని భూమన కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు. దేశం, రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని శతాబ్దాలుగా టీటీడీ ఆధ్వర్యంలో యాగాలు నిర్వహించే సంప్రదాయం ఉందన్నారు. ప్రస్తుత పాలకులు టీటీడీ వైదిక కార్యక్రమాలను పక్కనపెడుతున్నారని, వేద సంస్కృతి, ధార్మిక కార్యక్రమాల పరిరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. వేద పరిరక్షణకు నిధులు ఉన్నప్పటికీ అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం లేదని అన్నారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తిరుమలలోని జలాశయాలు ఎండిపోతున్నాయని భూమన తెలిపారు. చిన్న దేవాలయాల పాలక మండళ్లు సైతం వరుణయాగాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీటీడీ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. వీఐపీ సేవలకే పరిమితం కాకుండా ప్రజల శ్రేయస్సు, ధార్మిక సంప్రదాయాల పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. టీటీడీ వెంటనే వరుణయాగం నిర్వహించడంతో పాటు వేద, వైదిక సంప్రదాయాలను కాపాడే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
 

Back to Top