తిరుపతి–తిరువణ్ణామలై రహదారి అభివృద్ధి చేయాలి

కేంద్రమంత్రికి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల ప్రతిపాదన

ఢిల్లీ: తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువణ్ణామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, తిరువణ్ణామలై ఎంపీ సి.ఎన్‌. అన్నాదురై కలిసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని న్యూఢిల్లీలో కలిశారు.

తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే భక్తులకు ఈ మార్గం ఎంతో కీలకమని ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించారు. రెండు రాష్ట్రాల ప్రజలు, భక్తులు, వ్యాపారులు ఈ రహదారిని పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న రాకపోకలకు అనుగుణంగా రహదారిని అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

రహదారి విస్తరణ, అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, వాహనదారులకు మెరుగైన భద్రత కల్పించేలా రహదారి ప్రమాణాలను పెంచడం వంటి అంశాలను ఎంపీలు ప్రస్తావించారు. ఈ మార్గం అభివృద్ధి జరిగితే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు మధ్య రవాణా మరింత సులభతరం అవుతుందని, రెండు రాష్ట్రాల ప్రజలకు, భక్తులకు, వ్యాపార వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారని, సంబంధిత అధికారులతో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు.
 

Back to Top