అర్హత కలిగిన ప్రతి ఓటు హక్కును కాపాడాలి

మాజీ మంత్రి సాకే శైలజానాథ్

అనంత‌పురం: ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ఓటర్ల వెరిఫికేషన్‌ ప్రక్రియలో అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు హక్కు కూడా తొలగిపోకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ మంత్రి, సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్‌ కోరారు. బుధవారం గార్లదిన్నె మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తహసీల్దార్‌, సంబంధిత అధికారులతో ఓటర్ల జాబితా పరిశీలనపై చర్చించారు. మృతిచెందిన వ్యక్తుల పేర్లు, అర్హత లేని ఓట్లను నిబంధనల ప్రకారం తొలగించడంలో అభ్యంతరం లేదని, అయితే అవసరమైన ధృవపత్రాలు అందుబాటులో లేవనే కారణంతో అర్హత కలిగిన పౌరుల ఓట్లను తొలగించడం సరికాదని శైలజానాథ్‌ స్పష్టం చేశారు. అవసరమైన ధృవపత్రాలు ప్రభుత్వ శాఖల ద్వారానే జారీ అవుతున్నందున, పత్రాలు సమర్పించడంలో ప్రజలకు ఇబ్బందులు ఉంటే అధికారులు వారికి సహకరించాలని సూచించారు.

అర్హులైన ఓటర్ల ఇళ్లకు బీఎల్‌ఓలు వెళ్లి అవసరమైన ధృవపత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు, వాటిని సంబంధిత శాఖల ద్వారా పొందేందుకు సహకరించాలని తహసీల్దార్‌ను కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి అర్హత కలిగిన పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగాలని అన్నారు. ప్రజలకు ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారులు, బీఎల్‌ఓల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా సహకరించాలని శైలజానాథ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, అనంతపురం జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు నారాయణరెడ్డి, సీనియర్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, గార్లదిన్నె మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, సింగనమల నియోజకవర్గ బూత్‌ కన్వీనర్‌ ఓబిరెడ్డి, గార్లదిన్నె మండల బూత్‌ కన్వీనర్‌ సుంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top