తాడేపల్లి: మెగా డీఎస్సీ విషయంలో ప్రభుత్వం సమగ్ర చర్చకు సిద్ధమా? అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. డీఎస్సీపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవకతవకలపై సమాధానం చెప్పడంతోపాటు మంత్రి లోకేష్ రాజీనామా చేయించి, డీఎస్సీ -2025పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పోస్టుల పేరుతో లక్షల్లో బేరసారాలు జరిగిన ఫోన్ సంభాషణలు బయటకొచ్చినా ఆ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. ఎవరు డబ్బులు అడిగారు, ఎవరితో మాట్లాడారు, ఎక్కడ బేరసారాలు జరిగాయి అన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డీఎస్సీపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని.. జీవోలు, కాల్ రికార్డింగులు, మెరిట్ లిస్టు జాబితాలు, తదితర అన్ని ఆధరాలతో ప్రభుత్వాన్ని శాసనమండలిలో నిలదీస్తామని చెప్పారు. డీఎస్సీ విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకుండా పోతోందని అన్నారు. డీఎస్సీ పోస్టుల పేరుతో జరిగిన బేరసారాలకు సీఎం చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. అన్ని ఆరోపణలకు శాసనమండలిలో ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రైతు పెట్టుబడి పెట్టిన తర్వాత అకస్మాత్తుగా నీళ్లు ఇవ్వలేమని చెప్పడం సరికాదు. ముందుగానే పరిస్థితులను ప్రకటించి రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గతంలో పంటల బీమా ప్రభుత్వమే చెల్లించేది.. ఇప్పుడు రైతులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల తీసుకొచ్చిన పీపీపీ విధానం కూడా దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉంది.. దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉద్యోగులకు పీఆర్సీ లేదు.. ఉద్యోగ సంఘాలు సమస్యలు చెప్పుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బలహీన వర్గాల నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ అంశాలన్నింటినీ శాసనమండలిలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉందో ప్రభుత్వం చెప్పాలి. చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, వెన్నుపోటు పార్టీ నాయకులకు మాత్రమే అభివృద్ధి కనిపిస్తోంది.. రాష్ట్ర ప్రజలకు ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు. వైఎస్సార్‌సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి.. మేమే ప్రధాన ప్రతిపక్షం. అసెంబ్లీలో రెండు పక్షాలే ఉన్నాయి.. కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. రాజ్యాంగబద్ధంగా మా హక్కుల కోసం పోరాడతాం.. బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ భయపడదు. పోలీసుల విషయంలో ‘ఫేక్ పోలీసులు’ అంటూ మాట్లాడటం ప్రభుత్వ పరిపాలన ఏ స్థాయిలో ఉందో చూపిస్తోంది. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ, వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలో పాలన ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనించాలి. బీసీ నాయకులే టార్గెట్ గా అక్రమ కేసులు : ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గత 70 రోజులుగా డీఎస్సీ వ్యవహారంపై వైఎస్సార్సీపీ 12 రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిందని, స్పోర్ట్స్ కోటా కింద 469 పోస్టులను అమ్ముకున్న కుంభకోణంపై మండలి సాక్షిగా సాక్ష్యాధారాలతో సహా కూటమి ప్రభుత్వ బాగోతాన్ని బయటపెడతామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ స్కామ్‌పై సీబీఐ (థర్డ్ పార్టీ) విచారణ జరగాలని వైఎస్ జగన్ గారి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, సీదిరి అప్పలరాజు, విరుపాక్షి, తమ్మినేని సీతారాం, జోగి రమేష్ తదితర బీసీ నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో జరిగిన ప్రియాంక దారుణ హత్యతో పాటు సాయికృష్ణ, కాంతికుమార్ వంటి వారి హత్యలపై రాష్ట్ర హోంమంత్రిని మండలిలో నిలదీస్తామన్నారు. రాష్ట్రంలో అత్యంత దయనీయంగా రైతుల పరిస్థితి రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, వరి, పత్తి, పొగాకు, టమాటా, మిర్చి.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని, ఈ రాష్ట్రంలో కేవలం 'గంజాయి'కి మాత్రమే గిట్టుబాటు ధర పలుకుతున్న దుస్థితి నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు. ఏ ఒక్క ఉద్యోగీ సంతోషంగా లేరని, సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్ల సమస్యలు, విద్యార్థుల కష్టాలపై అసెంబ్లీలో గళమెత్తుతామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వానికి బాధ్యత ఉందని, మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు ఈ నెల 17 నుంచి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన తేల్చిచెప్పారు.