ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలి

చట్ట సవరణ అవసరమైతే చేపట్టాలని కేంద్రాన్ని కోరనున్న ఉపాధ్యాయ సంఘాలు

తాడేపల్లి : రాష్ట్రంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయులకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఇప్పటికే ఉద్యోగంలో కొనసాగుతున్న వేలాది మంది ఉపాధ్యాయులు పదోన్నతులు, ఇతర సర్వీస్‌ ప్రయోజనాల కోసం మళ్లీ టెట్‌ రాయాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందని వారు వివరించారు. దీర్ఘకాలంగా బోధనా వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి పూర్తిస్థాయి మినహాయింపు కల్పించేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు.

ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిపై స్పందించిన వైయస్‌ జగన్‌ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకున్నారు. ఆయన సూచనతో కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 13న కేంద్ర విద్యాశాఖ మంత్రితో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాల ప్రతినిధులు, వైయస్సార్‌సీపీ ఎంపీల బృందం సమావేశం కానుంది.

ఈ భేటీలో ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న టెట్‌ సమస్యను కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, పూర్తి మినహాయింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అవసరమైతే నిబంధనల్లో మార్పులు, చట్ట సవరణ చేపట్టాలని విజ్ఞప్తి చేయనున్నారు.

ఈ ప్రతినిధి బృందంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎం.వి. రామచంద్రారెడ్డి, కె. కల్పలత, పి. చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఏపీయస్‌ఆర్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్‌ జంషీద్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సి.కె. వెంకటనాథరెడ్డి, గౌరవాధ్యక్షుడు పి. అశోక్‌కుమార్‌, ఇతర ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొననున్నారు. 
ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌కు పరిష్కారం లభించేలా కేంద్రంతో చర్చించాలని కోరగా, సమస్య పరిష్కారానికి వైయస్సార్‌సీపీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 

Back to Top