శ్రీశైలంలో నీళ్లున్నా.. సీమకు కన్నీళ్లేనా? 

రాయలసీమపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమే

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్‌

అనంత‌పురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్‌

శ్రీశైలంలో నీళ్లున్నా రాయలసీమ రిజర్వాయర్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయి?

రాయలసీమకు తక్షణం కృష్ణా జలాలు విడుదల చేయాలి

పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి సామర్థ్యంతో నీళ్లు విడుదల చేయాలి

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను తక్షణం పూర్తి చేయాలి

అమరావతిపై ఉన్న శ్రద్ధ రాయలసీమపై కూడా పెట్టాలి

రాయలసీమ రైతాంగాన్ని కరువు నుంచి కాపాడాలి 

మాజీ మంత్రి సాకె శైలజానాథ్ డిమాండ్ 

అనంత‌పురం: రాయలసీమ ప్రాజెక్టులకు నీరివ్వడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, శ్రీశైలం ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లున్నా రాయలసీమ రిజర్వాయర్లను నింపకుండా రైతుల పొట్టగొడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సాకె శైలజానాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నాయుడి దగాకోరు బుద్ధిని, సీమ పట్ల ఆయనకున్న కక్ష సాధింపు వైఖరిని ఎండగట్టారు. 'రాయలసీమకు నేను పెద్ద బిడ్డను' అని చెప్పుకునే చంద్రబాబు, వాస్తవానికి సీమ పాలిట 'చెడ్డ బిడ్డ'గా మిగిలిపోతాడని విమర్శించారు. రాయలసీమలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, అనంతపురంతోపాటు రాయలసీమ జిల్లాల్లో మెట్ట పంటలు వేసిన రైతులు పంటలు చేతికి వస్తాయో రావోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా తక్షణం పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేసి రాయలసీమలోని కింది రిజర్వాయర్లను నింపాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. “మేము అడుక్కోవడం లేదు.. దేహి అనడం లేదు.. మా నీళ్లు మాకు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం” అని అన్నారు.

మాటలు కోటలు దాటుతాయి.. చేతలు గడప దాటవు

కూటమి ప్రభుత్వ తీరు చూస్తుంటే రాయలసీమ రైతాంగం భయం గుప్పిట్లో బతుకుతోంది. పాలకుల నోటి నుంచి మాటలు దండిగా వస్తున్నాయి కానీ, ఆచరణ శూన్యం. శ్రీశైలం డ్యామ్‌లో ప్రస్తుతం 878 అడుగుల మేర 181 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 841 అడుగుల పైనుంచే 40వేల‌ క్యూసెక్కుల నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం కేవలం 6వేల‌ నుంచి 7వేల  క్యూసెక్కులు మాత్రమే వదులుతూ సీమకు తీవ్ర అన్యాయం చేస్తోంది.

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. కళ్లప్పగించి చూస్తున్న సర్కార్

కింద రిజర్వాయర్లు అడుగంటిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. రాయలసీమలోని జలాశయాల దుస్థితికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణం

తెలుగుగంగ పరిస్థితి: బ్రహ్మం సాగర్‌లో 49.9 టీఎంసీలు, వెలుగోడులో 17.6శాతం, సోమశిలలో 32.39శాతం, కండలేరులో 34శాతం మాత్రమే నీళ్లున్నాయి. 11 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరకల్లులో కేవలం 2.5 టీఎంసీలు (23శాతం) మాత్రమే ఉన్నాయి. అవుకులో 25శాతం, గండికోటలో 57శాతం, వామికొండలో 39శాతం, చిత్రావతిలో 30శాతం నీరు మాత్రమే ఉంది. జీడిపల్లిలో కేవలం 18 శాతం (0.317 టీఎంసీలు) నీరుంది. గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండలలో కనీసం అర టీఎంసీ నీరు కూడా లేదు. కృష్ణాగిరిలో కేవలం అడుగున తేమ మాత్రమే మిగిలింది. దీంతో అనంతపురం జిల్లా రైతుల ప‌రిస్థితి దయ‌నీయంగా త‌యారైంది. 

తెలంగాణ ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందం చేసుకున్నారా?

శ్రీశైలంలో నీటి మట్టం 840 అడుగుల కిందకు పడిపోతే రాయలసీమకు చుక్క నీరు కూడా రాదు. అందుకే ముందుచూపుతో వైఎస్ జగన్ గారు 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేలా 'రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్' ప్రాజెక్టును డిజైన్ చేసి 80 శాతం పనులు పూర్తి చేశారు. కానీ, చంద్రబాబు అధికారంలోకి రాగానే తెలంగాణ ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందం చేసుకుని ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. తెలంగాణ సీఎంకు ఇచ్చిన మాట కోసం రాయలసీమ రైతుల గొంతు కోస్తారా? 

వైఎస్సార్, జగనన్నల కలలను కాలరాశారు

నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారు రాయలసీమపై ప్రేమతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 10 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచితే, ఆయన తనయుడు వైఎస్ జగన్ గారు హంద్రీనీవా సామర్థ్యాన్ని 3,800 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచుతూ జీవో ఇచ్చి, టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టారు. కానీ, అధికారంలోకి రాగానే బాబు ఆ టెండర్లను రద్దు చేసి అనంతపురం జిల్లాకు తీరని ద్రోహం చేశారు.

తక్షణమే పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు విడుదల చేయాలి

చంద్రబాబుకు అమరావతి కరకట్ట మీద ఉన్న ప్రేమ, రాయలసీమ రైతుల మీద లేదు. నీళ్లు వచ్చాకే పరిశ్రమలు (కియా వంటివి) వచ్చాయి తప్ప, పరిశ్రమలు వస్తే నీళ్లు రాలేదు. ఇప్పటికైనా ప్రగల్భాలు మాని, తక్షణమే పూర్తి సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసి కింద ఉన్న రిజర్వాయర్లను నింపాలి. లేనిపక్షంలో సాగునీరే కాదు, తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకక సీమ ప్రజలు అల్లాడిపోయే ప్రమాదం ఉంది. రాయలసీమ రైతుల ఉసురు తగిలితే కూటమి ప్రభుత్వం మాడి మసైపోవడం ఖాయం అని శైలజానాథ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Back to Top