విజయవాడ: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆదివారం జెన్ జి వార్ సమావేశం నిర్వహించారు. స్థానిక భీమన్నవారిపేటలోని ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. సమావేశంలో డీఎస్సీ–2025లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ సమస్యలపై ప్రజెంటేషన్ నిర్వహించారు. అనంతరం పలువురు విద్యార్థులు తమ సమస్యలను వేదికపై వివరించారు. జెన్ జి వార్‌తో యువత హక్కుల పోరాటానికి శ్రీకారం మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా యువత, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం జెన్ జి వార్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. డీఎస్సీ–2025 నిర్వహణలో తీవ్ర అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించి నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంలో లోకేష్ బాధ్యత వహించాలి డీఎస్సీ నిర్వహణలో కన్వీనర్‌ను పక్కనబెట్టి ఇతర అధికారులకు పూర్తి బాధ్యతలు అప్పగించడం ద్వారా పారదర్శకత దెబ్బతిందన్నారు. ప్రశ్నపత్రాల తయారీ, డిజిటల్ నిర్వహణ వంటి అత్యంత కీలక పనులను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం వల్లే లీకేజీలకు అవకాశం కల్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి రాజకీయ, పరిపాలనా బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి హామీ ఎందుకు అమలు కాలేదు? 2024 ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. నిరుద్యోగుల తరఫున వైయస్ఆర్‌సీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రతిభకు అన్యాయం, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్యకు ఉద్యోగం రాకపోవడం బాధాకరమన్నారు. కేవలం పాల్గొన్న సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు రావడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, స్పోర్ట్స్ కోటా నిబంధనలను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చి ఉద్యోగాలు కేటాయించారని విమర్శించారు. ఒక్కో టీచర్ పోస్టు కోసం భారీ మొత్తాలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోలేదన్నారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, విద్యాదీవెన, వసతిదీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య వర, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, క్లస్టర్, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.