ప్రకాశం: అద్దంకి నియోజకవర్గం శంఖవరం గ్రామం వద్ద పోలీసుల వాహనం ప్రమాదానికి గురైన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కోరారు. ప్రమాదానికి గురైన కారులో గంజాయి, మద్యం, బీరు బాటిళ్లు లభించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఘటనపై సిట్ ఏర్పాటు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. “చంద్రబాబు ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని చెబుతున్నారు. అలాంటప్పుడు ఎస్‌ఐలు నడుపుతున్న కారులో గంజాయి, మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయి? అవి చట్టబద్ధంగా వచ్చాయా? అక్రమంగా వచ్చాయా? పోలీసులకు గంజాయి దొరికితే ఆ విషయాన్ని బయటకు ఎందుకు చెప్పడం లేదు? కారులో మద్యం, బీరు బాటిళ్లు ఎందుకు ఉన్నాయి?” అని ప్రశ్నించారు. పోలీసులే మద్యం సేవించారా? “గంగమ్మ గుడి వద్ద పోలీసులు పార్టీ చేసుకున్నారని, ఆ సమయంలో మద్యం సేవించారని, గురజాల సీఐ మురళీ కూడా అక్కడికి వచ్చారని సమాచారం ఉంది. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. ఎస్‌ఐలు ఉన్న కారులోనే గంజాయి దొరకడం అత్యంత ఆందోళనకరమైన విషయం” అని బూచేపల్లి పేర్కొన్నారు. “ఈ ఘటనపై వెంటనే సిట్ ఏర్పాటు చేయాలి. హోంమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. ప్రమాదానికి ముందు, తర్వాత జరిగిన ప్రతి పరిణామాన్ని సమగ్రంగా దర్యాప్తు చేయాలి. ఎస్‌ఐలకు రక్త పరీక్షలు నిర్వహిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి” అని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి ఎందుకు తరలించలేదు? “మీ ఎస్‌ఐలు నడుపుతున్న కారు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని కనీసం ఆస్పత్రికి తరలించలేదు. మీ తప్పు లేకపోతే ప్రమాదం జరిగిన తర్వాత ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు? సాయంత్రం ప్రమాదం జరిగితే అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల వ్యవహారశైలిపై చర్చ జరుగుతోంది. గ్రానైట్ అక్రమ వ్యాపారం సజావుగా సాగేందుకు పోలీసులకు పార్టీ ఇచ్చారనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఆ కారులో డబ్బుతో పాటు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి” అని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. శంఖవరం ప్రమాద ఘటనలో పోలీసుల పాత్రపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. సిట్ దర్యాప్తుతో పాటు సంబంధిత పోలీసులకు రక్త పరీక్షలు నిర్వహించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనంలో లభించిన వస్తువుల మూలాలను పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలని కోరారు.