తాడేపల్లి: డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా గ్రూప్ -1 నియామాకాలలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణ జరిపినా సరే తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేసారు. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఎస్సీలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై కూడా సీబీఐ విచారణ జరపేందుకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎవరు తప్పు చేసినా తప్పే కాబట్టి ప్రభుత్వం విచారణ నివేదిక మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. డిఎస్సీ అయినా, గ్రూప్-1 అయినా సరే ఏ నియామక పరీక్షలో అవకతవకలు జరిగినా దోషులను శిక్షించాల్సిందేనని స్పష్టం చేసారు. రాజకీయంగా ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం కాదని హితవు పలికారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరగడమే అంతిమ లక్ష్యమని లేళ్ప అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తక్షణమే ప్రభుత్వం డిఎస్సీపై చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేసారు. మండలిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ డిఎస్సీపై చర్చకు వాయిదా తీర్మానం ఇస్తే ఎందుకు తిరస్కరించారో చెప్పాలని, డిఎస్సీపై చర్చ అంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో తేల్చి చెప్పాలని సవాల్ విసిరారు. మండలిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడుతుంటే, మంత్రి నారా లోకేశ్ మాత్రం, శాసనసభలో డిఎస్సీపై వివరణ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మండలిలో వైఎస్సార్ సీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నందున అక్కడ సమాధానం చెప్పేందుకు లోకేశ్ భయపడుతున్నారని లేళ్ల అప్పిరెడ్డి ఆక్షేపించారు. డిఎస్సీపై శాసనసభలో లోకేశ్ ఏం మాట్లాడారో, అదే అంశం మండలిలో మాట్లాడేదంకు కట్టుబడాలని సవాల్ చేసారు. ప్రభుత్వం ఏ విధంగా డిఎస్సీ పరీక్ష నిర్వహించింది? పేపర్ లీకేజీ ఆరోపణలపై ఏం చేశారు? నియామక నిబంధనలు ఎందుకు మార్చారు? జీఓలు ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఏ విధానం అనుసరించారు? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేసారు. వైఎస్సార్ సీపీ సభ్యులు డిఎస్పీపై పూర్తి ఆధారాలతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం కూడా ఆధారాలతో సమాధానం చెప్పాలన్నారు. ఈ ప్రెస్ మీట్ లో లేళ్ల అప్పిరెడ్డి ఇంకా ఏం మాట్లారంటే... మంత్రి లోకేశ్ అడ్డంగా దొరికిపోయాడు రాష్ట్రంలో గతంలో డిఎస్సీ పరీక్షల నిర్వహణకు డిఎస్సీ కన్వీనర్, ఎస్ సీ ఈఆర్టీ డైరెక్టర్ వంటి నిర్దిష్ట వ్యవస్థ ఉండేది. కానీ 2025 డిఎస్సీ ప్రక్రియలో డిఎస్సీ కన్వీనర్ లేకుండానే కేవలం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించామని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెప్పడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. చట్టంలో ఎక్కడా “కన్వీనర్ ఉండకూడదు” అని లేదనే వాదన మంత్రి లోకేశ్ చేయడం సరైన సమాధానం కాదు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నిర్దిష్ట విధానాలు, పరిపాలనా సంప్రదాయాలు ఉంటాయి. వాటిని ఎందుకు పక్కన పెట్టారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. అలాగే ఎస్సీఈఆర్టీ లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్‌కు జిల్లా స్థాయిలో టాప్ ర్యాంక్ వచ్చినప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు. దీనిపై వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తే నియామకాల ప్రక్రియకు నవీన్ హాజరు కాలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఒక కారణం చెప్పినట్లు మాకు సమాచారం ఉంది. కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం సదరు అభ్యర్థి నవీన్ ఎన్ ఓ సీ తీసుకోలేదని మరో కారణం చెబుతున్నారు. కార్యదర్శి చెప్పిన మాటకు, ప్రభుత్వం కోర్టులో చెప్పిన విషయాలకు, మంత్రి లోకేశ్ అసెంబ్లీలో చెప్పిన విషయాలకు మధ్య ఎందుకు తేడా ఉంది? దీనిపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు డిఎస్సీ పేపర్ లీకేజీ, ఉద్యోగాల కోసం లక్షలాది రూపాయల మేర బేరసారాలు జరిగాయన్న ఆరోపణలు, ఆడియోలు బయటకు వచ్చిన అంశాలను ప్రభుత్వం తేలికగా తీసుకుంటోంది. ఈ అంశంపై నిరుద్యోగుల ఆవేదన మేరకు వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీనిపై ప్రభుత్వంను ప్రశ్నిస్తే, కేసు పెట్టాం, బెయిల్ వచ్చింది అని చెప్పడం సరిపోదు. అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు? ఎంతమంది ప్రమేయం ఉంది? నిరుద్యోగుల భవిష్యత్తుతో ఎవరు ఆటలాడారు? అన్నది సమగ్ర విచారణ ద్వారా తేలాలి. దేశంలో ఇతర పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడుడిఎస్సీ విషయంలో కూడా నిష్పక్షపాతంగా సీబీఐ విచారణ జరిపించడానికి ప్రభుత్వానికి అంత భయం ఎందుకు? స్పోర్ట్స్ కోటా అక్రమాలపై మంత్రి లోకేశ్ స్వయంగా పీవీ సింధు ఉదాహరణను ప్రస్తావించారు. దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తీసుకొచ్చిన పీవీ సింధు వంటి క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం వేరు. కానీ సాధారణ స్పోర్ట్స్ కోటా నియామకాలను అలాంటి ప్రపంచస్థాయి క్రీడాకారులతో పోల్చడం ఏమాత్రం సరికాదు. 2012లోని జీ.ఓ. 76ను నోటిఫికేషన్‌కు ముందు మార్చి జీ.ఓ. 447 తీసుకురావడం, పరీక్ష రాయకుండానే కొందరికి ఉద్యోగాలు ఇచ్చే విధానాన్ని అనుసరించడం, ఆ తర్వాత జీ.ఓ. 447ను రద్దు చేసి మళ్లీ జీ.ఓ. 56 తీసుకురావడం వెనుక అసలు కారణమేంటి? నిబంధనలు ఎందుకు మార్చారు? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి మార్చారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు వైఎస్సార్ సీపీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. మా మా డిమాండ్లు ఇవే.. డిఎస్సీపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలి. నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేయాలి. పేపర్ లీకేజీ, బేరసారాల ఆడియో, వీడియో ఫుటేజీ ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. భవిష్యత్తులో అర్హత కలిగిన ప్రతి నిరుద్యోగికి న్యాయం జరిగేలా పారదర్శక నియామక విధానాన్ని అమలు చేయాలి. దమ్ము, ధైర్యం ఉంటే శాసన మండలిలోడిఎస్సీపై చర్చకు రావాలని ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆటలాడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ సహించేది లేదు. . అవసరమైతే విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కలిసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.