ప్రకాశం: అద్దంకి నియోజకవర్గం శంఖవరప్పాడు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం, పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం లభించిందన్న అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని వైయస్ఆర్‌సీపీ అద్దంకి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ కోరారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, గ్రామస్థులను బెదిరించిన సీఐతో పాటు ప్రమాదానికి కారణమైన ఎస్‌ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం చింతలపూడి అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. “శంకవరప్పాడు గ్రామ ప్రజలు ప్రమాదం గురించి మాకు వివరించారు. కారుతో ఆటోను ఢీకొట్టిన ఎస్‌ఐలు గ్రామస్థులను దుర్భాషలాడటంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో గ్రామస్థులు కారును పరిశీలించారు. డ్రైవింగ్ సీటు వద్ద ఓపెన్ చేసిన బీర్ బాటిల్ కనిపించింది” అని తెలిపారు. కారును తనిఖీ చేయకుండా అడ్డుకున్న పోలీసులు “అప్పటికే ఇద్దరు ఎస్‌ఐలతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి వచ్చి ఎస్‌ఐలకు, కారుకు కాపలాగా ఉన్నారు. కార్ డిక్కీని తెరవబోయిన గ్రామస్థులపై కానిస్టేబుళ్లు, సీఐ దౌర్జన్యానికి దిగారు. కారులో ఏముంది అనే విషయాన్ని బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు” అని అశోక్‌కుమార్ పేర్కొన్నారు. “కార్ డిక్కీలో ఐదు కేజీల గంజాయి ఉందని, బ్లూ కలర్ బ్యాగ్‌లో డబ్బు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ తేలాలంటే సమగ్ర విచారణ జరగాలి. ప్రమాదంలో గంజాయి లభించిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాను. అయినా డీఎస్పీతో సహా కొంతమంది పోలీసులు కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు” అని అన్నారు. “బైక్‌ను చేజ్ చేస్తూ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ బైక్ నంబర్ ఎందుకు గుర్తించలేదు? గత నెల 7వ తేదీన పట్టుకున్న గంజాయిలో కొంత భాగాన్ని ఎస్‌ఐలు తీసుకొస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. దీనిపై కూడా విచారణ జరపాలి. పోలీసులే తప్పు చేసి దొరికితే చర్యలు ఉండవా?” అని అశోక్‌కుమార్ ప్రశ్నించారు. “అద్దంకి నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థను దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. మట్టి మాఫియా పోలీసులపై దాడి చేసినా కూటమి నేతలపై కేసులు ఉండవు. పోలీసుల సహాయంతో కూటమి నేతలు బరితెగిస్తున్నారు. అద్దంకి భవాని సెంటర్‌లో తమకు లొంగలేదనే కారణంతో ఒంటరి మహిళపై కూటమి నేతలు దాడి చేసినా చర్యలు ఏమయ్యాయి?” అని అశోక్‌కుమార్ ప్రశ్నించారు. హోంమంత్రి సమాధానం చెప్పాలి “అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై హోంమంత్రి అనిత ఏమి చేస్తున్నారు? శంఖవరప్పాడు గ్రామస్థులను బెదిరిస్తున్న సీఐతో పాటు ప్రమాదానికి కారణమైన ఎస్‌ఐలను వెంటనే సస్పెండ్ చేయాలి. పోలీసుల కారులో గంజాయి, మద్యం ఎలా వచ్చాయో తేల్చాలి. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలను ప్రజల ముందు ఉంచాలి” అని డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. శంఖవరప్పాడు ఘటనపై వస్తున్న ఆరోపణలు, అనుమానాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ కోరింది. ఘటనలో వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.