నెల్లూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మనుబోలు మండలం వీరంపల్లి, ముద్దుమూడి గ్రామాల్లో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్వహణను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఇరిగేషన్ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, గతంలో ఉపాధి హామీ పథకం కింద పూర్తయిన పనులనే తిరిగి ఇరిగేషన్ శాఖ ద్వారా మంజూరు చేయించి రెండుసార్లు బిల్లులు చెల్లిస్తున్నారన్న ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరపాలని కాకాణి డిమాండ్ చేశారు. ఒకే పనికి రెండు విధాలుగా బిల్లులు చెల్లిస్తే బాధ్యులైన అధికారులు, వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మనుబోలులోని సంగమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో జొన్న కంకులను నిల్వ చేసి ట్రిప్పర్ల ద్వారా తరలించడంతో దుర్గంధం, దుమ్ముతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని కాకాణి తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రోడ్లు నిర్మించామని, ఇప్పుడు పవిత్రమైన దేవస్థాన ప్రాంగణాలను కూడా వ్యాపార కార్యకలాపాలకు వినియోగించడం దారుణమన్నారు. గ్రామాల్లో సైడ్ డ్రైన్లలో పూడిక తీయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రధాన రహదారులు గుంతలమయమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎస్‌ఆర్ నిధులను ప్రజలకు అవసరమైన కార్యక్రమాలకు కాకుండా పనికిరాని సోలార్ దీపాలకు మళ్లిస్తూ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ముత్తుకూరులో బల్కర్ల ప్రవేశం విషయంలోనూ అక్రమ వసూళ్ల ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. సోమిరెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు కలిసి సర్వేపల్లిని దోచుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైయస్ఆర్‌సీపీ ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలపై పోరాడుతుందని కాకాణి స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా వీరంపల్లిలో ఇటీవల మృతి చెందిన అడపాల బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను కాకాణి పరామర్శించారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్త, వాలంటీర్‌గా పనిచేసిన హేమంత్‌రెడ్డి నాయనమ్మ మారు రమణమ్మ మృతికి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ముద్దుమూడిలో వైయస్ఆర్‌సీపీ నాయకుడు కసుమూరు పెంచలయ్య కుమారుడు ప్రసాద్ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.