గ్రూప్-1పై సీబీఐ విచారణకు మేం సిద్ధం.. మీరు డీఎస్సీపై సిద్ధమా?

ప్ర‌భుత్వానికి బొత్స సత్యనారాయణ స‌వాల్‌

అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల‌తో క‌లిసి మాట్లాడిన మండలి విపక్ష నేత బొత్స 
సత్యనారాయణ

డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌లో అడుగ‌డుగునా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న 

విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఇవాళ అడ్డంగా దొరికిపోయాడు

పారదర్శకతకు పాతర వేశారని ఆయ‌నే ఒప్పుకున్నాడు 

డీఎస్సీ వ్యవహారంలో లీకేజీలను, తన తప్పులను తనకు తానుగానే అంగీకరించాడు 

డీఎస్సీ -2025 అక్ర‌మాల‌పై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి

విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి

ఏ త‌ప్పూ చేయ‌న‌ప్పుడు సీబీఐ విచార‌ణంటే భ‌యం దేనికి? 

బొత్స సత్యనారాయణ సూటి ప్ర‌శ్న 

అసెంబ్లీ మీడియా పాయింట్ : కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025లో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించడంతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై, మంత్రి లోకేష్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై మేం నిలదీస్తున్నందుకే, మంత్రి లోకేష్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నందుకే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయని ఈ వెన్నుపోటు కూటమి ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంద‌న్నారు. "మా హ‌యాంలో ఏ తప్పూ జ‌ర‌గ‌లేదు. గ్రూప్-1 పై సీబీఐ విచారణ చేయించుకోవచ్చు, దానికి మేం పూర్తి సిద్ధంగా ఉన్నాం. మరి మేం డిమాండ్ చేస్తున్నట్టుగా మీరు నిర్వహించిన డీఎస్సీపైన కూడా సీబీఐ విచారణ జరిపించడానికి ఎందుకు భయపడుతున్నారు? విద్యాశాఖ మంత్రి సభలో అడ్డంగా దొరికిపోయారు. మేం అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా, అధికారులతో చెప్పిస్తున్న ఆవుకథనే మళ్లీ చెబుతున్నారు."  అని బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించారు. 

ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే...

ఒకే వ్యక్తికి రెండు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం పార‌ద‌ర్శ‌క‌తకు పాత‌రేయ‌డం కాదా? 

ప్రశ్నపత్రాలు తయారు చేసే ఎస్‌ఈఆర్టీ బాధ్యతను, పరీక్షను నిర్వహించే డీఎస్సీ కన్వీనర్‌ బాధ్యతను చట్టంలో ఎక్కడా లేకపోయినా ఒకే వ్యక్తికి ఎందుకు అప్పగించారు? ఇది పారదర్శకతకు పాతర వేయడం కాదా? గతంలో ఏ డీఎస్సీలోనైనా ఇలా జరిగిందా?
నవీన్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కీలక విభాగంలో ఎందుకు పెట్టారు? అతనికి ఎన్ఓసీ (NOC) అవసరం లేదని మంత్రి అంటున్నారు. అసలు ఆ రూల్స్ మంత్రి లోకేష్‌కి తెలుసా?  ఆ నవీన్‌కు ముందుగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి, మెరిట్ లిస్టులో పెట్టి.. ఆ తర్వాత ఎందుకు తీసేశారు? సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదని మీరు చెబుతున్నారు. కానీ, అతనికి కాల్ లెటర్ రాకపోగా, తన ఐడీని ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేశారని విద్యాశాఖ అధికారులకు అతనే స్వయంగా మెయిల్ చేశాడు కదా?  వీటన్నింటిని బట్టి చూస్తే పేపర్ లీకేజీ జరిగిందన్నది సుస్పష్టం. ఆ బండారం బయటపడుతుందనే నవీన్ అనే వ్యక్తిని బ్లాక్ చేసి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కలెక్టరేట్లలో బహిరంగంగా మెరిట్ జాబితాలను ఉంచేవారు. కానీ ఇప్పుడు కేవలం ఎస్ఎంఎస్ పంపి చేతులు దులుపుకున్నారు. పక్కవాడికి మార్కులు ఎలా వచ్చాయో, ఉద్యోగం ఎలా వచ్చిందో అభ్యర్థులకు తెలియకుండా చీకట్లో ఉంచారు.

పీవీ సింధుతో పోల్చడం క్రీడాకారులను కించపరచడమే

స్పోర్ట్స్ కోటాలో 383 మందికి పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇచ్చామని ఒప్పుకున్న మంత్రి లోకేష్.. వారిని ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుతో పోల్చడం క్రీడాకారులను కించపరచడమే. కోటా ముసుగులో పోస్టులు అమ్ముకుని, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన నిజమైన క్రీడాకారుల పొట్టగొట్టారు. రూ. 14 లక్షలు, రూ. 20 లక్షలు అంటూ ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరిపై చర్యలు తీసుకున్నారు? ఎంతమందిని అరెస్టు చేశారు? వారి పేర్లు ఎందుకు వెల్లడించలేదు? ఎవరు ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయి అనే పూర్తి వివరాలు బయటకు రావాలి. ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆడియో కాల్స్ బయటపడ్డాయి. వాటిలో ఫోన్ నంబర్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. ఎఫ్ఐఆర్‌లో 'గుర్తు తెలియని వ్యక్తులు' అని రాసి, వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఇదేనా మీ విచారణ? ఇన్ని తప్పులు, అవకతవకలు, పోస్టుల అమ్మకాలు జరిగాయి కాబట్టే మొత్తం వ్యవహారం బయటకు రావాలి. ఈ డీఎస్సీ కుంభకోణంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలి. జరిగిన ఈ తప్పులకు నైతిక బాధ్యత వహించి మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. 

అచ్చెన్నాయుడు మంత్రి హోదాలో ఉండి సమాధానం చెప్పలేక నన్ను "దద్దమ్మ" అని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడు. వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించింది ఎవరో, ఎవరికి పాలనా అనుభవం ఉందో రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసు. ఇలాంటి అహంకారం, ఒళ్లు పొగరు ఉన్న వ్యక్తులు మంత్రి పదవికి అర్హులో కాదో ఆ వెన్నుపోటు పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని బొత్స స‌త్య‌నారాయ‌ణ హిత‌వు ప‌లికారు.
 

Back to Top