అసెంబ్లీ మీడియా పాయింట్: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని వై ఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. శాసనమండలిలో ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా మంత్రి లోకేష్ పారిపోతున్నారని వారు ఆక్షేపించారు. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించి దద్దమ్మ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ లోకేష్ అసెంబ్లీలో ఏకపక్షంగా ప్రెజెంటేషన్లు ఇస్తున్నారని, మండలిలో ప్రతిపక్షం ఉంటే ఎందుకు చర్చకు రావడం లేదని నిలదీశారు. డీఎస్సీ నిర్వహణలో ఎస్సీఈఆర్టీ, డీఎస్సీ కన్వీనర్ బాధ్యతలను ఒకరికే అప్పగించడం పారదర్శకత లేకపోవడాన్ని నిరూపిస్తుందని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఎన్ఓసీ లేకుండా అవకాశం ఇవ్వడం పేపర్ లీకేజీని స్పష్టం చేస్తుందని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు అమ్ముకుని, వారిని పీవీ సింధు గారితో పోల్చడం దారుణమని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు లక్షల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. గతంలో నిర్వహించిన గ్రూప్-1 పై సీబీఐ విచారణ ఎదుర్కోవడానికి తాము సిద్ధమని, మరి డీఎస్సీపై దర్యాప్తుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సవాల్ చేశారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణను ‘దద్దమ్మ’ అని దూషించిన మంత్రి అచ్చెన్నాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, తన సొంత నియోజకవర్గంలోనే ఎరువుల కోసం ఎదురుచూస్తూ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోతే కనీసం పరామర్శించని ఆయనకు స్మగ్లర్లను వెనుకేసుకువచ్చే నైతికత ఉందని విమర్శించారు. ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను పూర్తిగా నాశనం చేసిందని, ఆరోగ్యశ్రీ వ్యాధులను సగానికి తగ్గించిందని, అంతేకాక టెట్ మినహాయింపు కోసం ఢిల్లీ వెళ్లిన ఐదుగురు సీనియర్ ఉపాధ్యాయులను కనీస నోటీసులు లేకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. కేంద్రంలోని తమ కూటమి ప్రభుత్వం ద్వారా టెట్ మినహాయింపు బిల్లును తీసుకురావాలని, లేకపోతే వైఎస్సార్సీపీ ఎంపీల ద్వారా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి ఉపాధ్యాయులకు అండగా నిలుస్తామని చెప్పారు. ఈ విధంగా ప్రభుత్వం ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, డీఎస్సీ అక్రమాలపై మండలిలో చర్చించి సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. మండలిలో ప్రశ్నలడిగితే అసెంబ్లీలో లోకేష్ గొప్పలు - తోట త్రిమూర్తులు డీఎస్సీపై చర్చ జరగాలని మేము కౌన్సిల్‌లో పట్టుబడుతుంటే, ప్రతిపక్షం లేని శాసనసభలో ఏకపక్షంగా స్టేట్‌మెంట్‌లు చదువుకుంటూ తమకు తాము డబ్బాలు కొట్టుకుంటున్నారు. చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రతిపక్షం ఉన్న కౌన్సిల్‌లోకి ఎందుకు రావడం లేదు? ఇక్కడికి వస్తే మీ అవకతవకలు, తప్పులు ఎత్తిచూపుతామనే భయంతోనే మీరు పారిపోతున్నారు. డీఎస్సీలో ఈబీసీ కోటా ఇచ్చామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు, మరి గతంలో ఈబీసీ కోటా కింద రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ పార్టీలో కీలకంగా ఉన్న నాగబాబుకు కేబినెట్ ర్యాంక్ వస్తుందని అంతా భావిస్తే, ఏదో నామమాత్రపు పదవి ఇచ్చి సరిపెట్టారు. ఏదేమైనా, డీఎస్సీపై చర్చ జరగకుండా పారిపోవడమే ఈ ప్రభుత్వ తప్పుడు విధానాలకు నిదర్శనం. ఈ ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసింది - వరుదు కల్యాణి ప్రజా ప్రతినిధులుగా ప్రజల బాధలను, ఆర్తనాదాలను మండలిలో వినిపించి, ప్రభుత్వాన్ని కదిలించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈ ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసింది; నాడు-నేడు పథకం అడ్రస్ లేకుండా పోయింది. ఆరోగ్యశ్రీలో గతంలో 3,224 వ్యాధులకు చికిత్స ఉంటే, ఇప్పుడు వాటిని 1,600 కు కుదించి, రోగులను ఆసుపత్రుల నుంచి తిప్పి పంపుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయాన్ని ఈ ప్రభుత్వం అట్టడుగుకు చేర్చింది. ఇక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీనియర్ నాయకుడైన మా బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి 'దద్దమ్మ' అని దుర్మార్గంగా మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనం. అచ్చెన్నాయుడూ, నీ నియోజకవర్గంలో యూరియా కోసం క్యూలో నిలబడి ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోతే కనీసం పరామర్శించావా? రూ.75 కోట్ల పేదల బియ్యాన్ని విశాఖలో అక్రమంగా దాచిన స్మగ్లర్లను వెనుకేసుకొస్తున్న నీకు మాట్లాడే నైతికత లేదు. సీబీఐ విచారణ అంటే భయం దేనికి? - రమేశ్ యాదవ్ వైఎస్సార్సీపీ బీసీ నేత, అపార రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారిని సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు ‘దద్దమ్మ’ అని దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ నియోజకవర్గంలో ఎరువులు దొరక్క, యూరియా కోసం క్యూలో నిలబడి ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోతే కనీసం పరామర్శించని నువ్వు అసలు మంత్రివేనా? రూ.75 కోట్ల పేదల బియ్యాన్ని విశాఖలో అక్రమంగా దాచిన స్మగ్లర్లను వెనుకేసుకువస్తున్న నీకు మా నాయకుడిని విమర్శించే నైతిక హక్కు లేదు. ఏ తప్పు చేయకపోతే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? విద్యాశాఖ మంత్రికి నిజంగా దమ్ముంటే, డీఎస్సీ అక్రమాలపై చర్చించడానికి పారిపోకుండా శాసనమండలికి రావాలి. రేపు మీరు డీఎస్సీపై చర్చకు రాకపోతే రాష్ట్ర ప్రజలందరూ సెప్టెంబర్ 1వ తేదీని ప్రపంచ వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటారు. దగా డీఎస్సీపై నాలుగు నెలలుగా పోరాడుతున్నాం - మొండితోక అరుణ్ కుమార్ గత నాలుగు నెలలుగా డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై వైఎస్సార్సీపీ పోరాడుతుంటే, ప్రభుత్వం మాత్రం మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీని తెరపైకి తెచ్చింది. జగనన్న ప్రభుత్వ హయాంలో సచివాలయ ఉద్యోగాలతో కలుపుకుని రెండు లక్షల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తే, ఈ ప్రభుత్వం కనీసం ఒక్క పోస్టు కూడా ఇవ్వకుండా పచ్చి అబద్ధాలు ఆడుతోంది. స్పోర్ట్స్ కోటాలో కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చి, వారిని ఏకంగా పీవీ సింధు గారితో పోల్చడం సిగ్గుచేటు. డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదో, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఎన్ఓసీ లేకుండా పరీక్ష రాసే అవకాశం ఎలా ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అవకతవకలు జరిగాయని మేం అడుగుతుంటే తప్పించుకు తిరుగుతున్న ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. పరీక్షలు లేకుండానే ఉద్యోగాలిచ్చారు - ఇసాక్ బాషా డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మేము శాసనమండలిలో డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా తిరస్కరిస్తోంది. డీఎస్సీలో పారదర్శకత లోపించింది అనడానికి ఎస్సీఈఆర్టీ, డీఎస్సీ కన్వీనర్ బాధ్యతలను ఒకే వ్యక్తికి అప్పగించడమే ప్రధాన నిదర్శనం. అలాగే, నవీన్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కీలక స్థానంలో కూర్చోబెట్టి, అతనికి మొదట మెరిట్ జాబితాలో మొదటి ర్యాంకు ఇచ్చి, ఆ తర్వాత తొలగించడం, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలవకుండానే ఐడీ బ్లాక్ చేయడం వంటి చర్యలు పేపర్ లీకేజీని కప్పిపుచ్చుకోవడానికేనని స్పష్టమవుతోంది. దాంతోపాటు, స్పోర్ట్స్ కోటా పేరుతో 62 కొత్త క్రీడలను చేర్చి, నకిలీ సర్టిఫికెట్లతో 383 మందికి పరీక్ష లేకుండానే ఉద్యోగాలు అమ్ముకున్నారు. గ్రూప్-1 సీబీఐ విచారణకు మేం సిద్ధం, డీఎస్సీపై మీరు సిద్ధమా? - పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బీఏసీ సమావేశంలో డీఎస్సీపై చర్చ జరగాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. శాసనమండలిలో బలమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఉందన్న విషయం అందరికీ తెలుసు. ప్రతిపక్షం లేని శాసనసభలో ఒక స్టేట్‌మెంట్ చదివేసి, మండలిలో చర్చకు రావడం లేదంటేనే.. మీరు తప్పు చేసినట్లు సగం ఒప్పుకున్నట్లే. వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే, లోకేష్ ఇక్కడ చర్చకు రాకుండా పారిపోతున్నారు. 2025 డీఎస్సీలో ఎంపికై ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన వారిని సైతం రోడ్ల మీదకు తెచ్చి ధర్నాలు చేయిస్తున్న పరిస్థితి ఏ ప్రభుత్వమైనా కల్పిస్తుందా? మీరు ఎంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించారో తగిన ఆధారాలతో సహా నిరూపించడానికి మేము సిద్ధం. దీనిపై కచ్చితంగా సీబీఐ దర్యాప్తు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్-1పై సీబీఐ విచారణకు మేం సిద్ధంగా ఉన్నాం. డీఎస్సీపై విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారా? కేంద్ర మంత్రిని కలిస్తే సస్పెండ్ చేస్తారా? - ఎంవీ రామచంద్రారెడ్డి దేశవ్యాప్తంగా 28 లక్షల మంది, రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు తమకు టెట్ (TET) నుంచి మినహాయింపు కావాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి సర్వీస్ ఉండి, 55-57 ఏళ్ల వయసులో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులను ఇప్పుడు మళ్లీ అన్ని సబ్జెక్టుల్లో టెట్ రాయమనడం ఎంతవరకు సమంజసం? వారు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి తమ సమస్యను చెప్పుకుంటే, కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా ఐదుగురు ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం దుర్మార్గం. ఉపాధ్యాయుల పట్ల మీ నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనం, వెంటనే ఆ సస్పెన్షన్లు ఎత్తివేయాలి. కేంద్రంలో మీ కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని టెట్ మినహాయింపు బిల్లును తీసుకురావాలి. మీరు ఆ పని చేయకపోతే, మా వైఎస్సార్సీపీ ఎంపీల ద్వారా ప్రైవేట్ మెంబర్ బిల్లునైనా ప్రవేశపెట్టి ఉపాధ్యాయులకు అండగా ఉంటామని మా అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు." మండలిలో చర్చంటే ఎందుకు భయం? - కల్పలతా రెడ్డి డీఎస్సీపై చర్చకు మేము సిద్ధమని సవాల్ విసిరిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, తీరా మండలిలో చర్చను ఈరోజు కాకుండా 20వ తేదీకి ఎందుకు వాయిదా వేశారు? అసెంబ్లీలో ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంతా బూటకమే.. తామే అక్రమాలకు పాల్పడి, తామే దానికి చప్పట్లు కొట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఒకవైపు ఖాళీలన్నీ సక్రమంగా భర్తీ చేశామని చెబుతూనే, గత ప్రభుత్వం భర్తీ చేసిన సచివాలయ ఉద్యోగాల గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు? మా డిమాండ్ ఒక్కటే, డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి.