తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) మరియు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)లకు రెండు వేర్వేరు లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో లేదా విదేశాల్లోనివసిస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు తమ తరఫున తల్లిదండ్రులు లేదా సమీప రక్తసంబంధీకుల ద్వారా ఒరిజనల్ పత్రాలు సమర్పించి వెరిఫికేషన్ పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించాలని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏకరూపంలో అధికారిక వీడియో-కాల్ వెరిఫికేషన్ మార్గదర్శకాలను తక్షణమే జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు అన్‌మ్యాప్డ్/వ్యత్యాసాల (Discrepancy) జాబితాలో ఉన్న ఓటర్లు మరియు నోటీసులు అందుకున్న వారి వివరాలను బూత్ వారీగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచి అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలని, అదేవిధంగా క్షేత్రస్థాయి విచారణలో ధ్రువీకరించబడిన నకిలీ/ద్వంద్వ (Duplicate) ఓట్లను నిబంధనల ప్రకారం వెంటనే తొలగించి ఓటర్ల జాబితా సవరణను నిష్పక్షపాతంగా నిర్వహించాలని లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లేఖల్లో పేర్కొన్న ప్రధానాంశాలు: 1. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని విద్యార్థులు, ఉద్యోగుల ధ్రువీకరణకు ఏకరూప మార్గదర్శకాలు ఇవ్వాలి. ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్న వారు, ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు వెళ్లిన విద్యార్థులు నియోజకవర్గాల్లో తాత్కాలికంగా అందుబాటులో లేనంత మాత్రాన వారి ఓటు హక్కును కాలరాయకూడదు. అటువంటి ఓటర్లు అన్ మ్యాప్డ్ విభాగంలో ఉన్నా లేదా నోటీసులు అందుకున్నా, వారి తరఫున సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో పాటు అసలు పత్రాలను సమర్పించేందుకు వారి తల్లిదండ్రులు లేదా సమీప రక్తసంబంధీకులకు పూర్తి అనుమతి ఇవ్వాలి. కొన్ని ప్రాంతాల్లో అధికారులు అనధికారికంగా వీడియో-కాల్ వెరిఫికేషన్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి గందరగోళం లేకుండా, చట్టబద్ధమైన భద్రతా చర్యలతో కూడిన అధికారిక 'వీడియో-కాల్ వెరిఫికేషన్' విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఈ నిబంధనలను రాష్ట్రంలోని అన్ని ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బిఎల్ఓలకు స్పష్టంగా ఆదేశాల రూపంలో జారీ చేయాలి. 2. అన్‌మ్యాప్డ్/వ్యత్యాసాల ఓటర్ల జాబితాను బూత్ వారీగా ప్రచురించాలి.. అన్ మ్యాప్డ్ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలు మరియు నోటీసులు జారీ చేసిన వారి జాబితాలను నియోజకవర్గాల వారీగా, పోలింగ్ బూత్‌ల వారీగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. అలాగే ఈ పూర్తి వివరాలను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు అధికారికంగా అందించాలి. ఈ సమాచారం బహిర్గతమైతేనే బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) ఆయా ఓటర్లను సంప్రదించి, నిర్దేశిత గడువులోగా సరైన పత్రాలు సమర్పించేలా సహాయపడగలరు. సమాచారం అందకపోవడం వల్ల ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా జాబితా నుంచి తొలగించబడకూడదు. 3. ధ్రువీకరించబడిన నకిలీ (Duplicate) ఓట్లను వెంటనే తొలగించాలి.. మరవైపు క్షేత్రస్థాయిలో ఇప్పటికే గుర్తించి, మ్యాప్ చేసిన నకిలీ ఓటర్ల పేర్లు ఇంకా ప్రచురిత జాబితాల్లో కొనసాగుతున్నాయి. సరైన విచారణ మరియు నిబంధనల ప్రకారం ద్వంద్వ నమోదులను తక్షణమే తొలగించాలి. కేవలం ఓటరు యొక్క నిజమైన, అసలైన ఒకే ఎంట్రీని మాత్రమే ఓటర్ల జాబితాలో కొనసాగించాలన్నారు. మరోవైపు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, ఓటర్లకు అనుకూలంగా ఉండాలన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. సరైన నోటీసు, తగిన విచారణ మరియు తమ వివరాలు నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా ఏ ఒక్క అర్హులైన ఓటరు పేరును తొలగించవద్దని వైయస్సార్సీపీ తరపున ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.