ఫీనిక్స్‌లో మహానేత వైయ‌స్ఆర్‌ 77వ జయంతి వేడుకలు 

ఘనంగా నిర్వహించిన వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ 

 మహానేత సంక్షేమ పాలన, ప్రజాసేవ స్ఫూర్తిని స్మరించిన తెలుగు ప్రవాసులు 

 'జగనన్న టెక్‌ఫోర్స్' బలోపేతంతో పాటు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని పిలుపు 

అమెరికా: ఫీనిక్స్‌లోని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు ప్రవాసులు, వైఎస్సార్‌సీపీ అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రజా సంక్షేమానికి చిరునామాగా నిలిచిన మహానేత ఆశయాలు, విలువలు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు.

మహానేతకు ఘన నివాళులు
కార్యక్రమం ప్రారంభంలో మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ప్రజాసేవ, దూరదృష్టి గల నాయకత్వం, సంక్షేమ పాలనను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శనను నిర్వహించారు. మహానేతతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన వినయం, ప్రజల పట్ల అపారమైన ప్రేమ, సేవా తపనను పలువురు స్మరించారు.

వైఎస్సార్ ఆశయాల సాధనకు ఐక్యంగా పనిచేయాలి

జ‌యంతి వేడుక‌ల్లో వర్చువల్‌గా పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివ రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్సార్‌ను నిజమైన ప్రజానేతగా అభివర్ణించారు. ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పులు తీసుకొచ్చిన సంక్షేమ పాలనకు ఆయన నాంది పలికారని అన్నారు. మహానేత ఆశయాలను కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగాలను మరింత బలోపేతం చేయడానికి ప్రారంభించిన  'జగనన్న టెక్‌ఫోర్స్` కార్యక్రమంలో సాఫ్ట్‌వేర్ నిపుణులు, ప్రవాస భారతీయులు చురుకుగా భాగస్వాములు కావాలని కోరారు.

 ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడుకోవాలి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఓటరు వివరాల ధృవీకరణ, ఎన్యూమరేషన్ ఫారాల పూరణ, అర్హులైన ప్రతి ఓటరు నమోదును నిర్దేశిత గడువులోగా పూర్తిచేసే విధానాన్ని సభ్యులకు వివరించారు. విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఈ అంశంపై అవగాహన కల్పించి ప్రతి ఓటును పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

 మహానేత వారసత్వాన్ని స్మరించిన డా. ప్రదీప్ చింత

ముఖ్య అతిథి డా. ప్రదీప్ చింత మాట్లాడుతూ మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి చిరస్థాయి వారసత్వాన్ని స్మరించారు. ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేశారు. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, గ్రామ–వార్డు సచివాలయ వ్యవస్థ వంటి విప్లవాత్మక సంస్కరణలను ప్రస్తావించారు. ప్రజా చైతన్యం కోసం ఎన్‌ఆర్‌ఐలు సోషల్ మీడియా వేదికల ద్వారా మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్ సంక్షేమ పాలనకు చిరస్మరణీయ గుర్తులు

సభలో మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, పావలా వడ్డీ వంటి చారిత్రాత్మక సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. ఈ పథకాల ద్వారా సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వచ్చిన మార్పులను వక్తలు వివరించారు. వైఎస్సార్ సంక్షేమ తత్వం నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

మహానేత ఆశయాల సాధనకు కమిటీ అంకితభావం

కార్యక్రమం ముగింపులో మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఫీనిక్స్ వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ తన అంకితభావాన్ని మరోసారి పునరుద్ఘాటించింది. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ పాలన లక్ష్యాల సాధనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వానికి నిరంతర మద్దతు అందిస్తామని సభ్యులు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ధీరజ్ పోలా, వంశీ ఎరువారం, చెన్నారెడ్డి మద్ధూరి, సోమశేఖర్ రెడ్డి యర్రపురెడ్డి, బొగరపు లక్ష్మి & గురు, బాలరాం రెడ్డి, శ్రీధర్ లక్కిరెడ్డి, రమేష్, శ్రీధర్ చెమిడ్తి, అంజి రెడ్డి, శ్రీనివాస్ మొల్లాల, విఘ్నేష్, కొండా రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, నాగేశ్ పొర్ల, వేమ శేఖర్, శ్రీనివాస్ మామిడి, రస్వంత్, పవన్ సిరసనంబేడు, సాయి రోహిత్ చెరుకుమిల్లి, శ్రావణ్, విష్ణు చొప్పా, విజయ్, ప్రవీణ్, ప్రకాష్, పురంధర్, శివ కొడూరు, నాగరాజు దాసరి, ప్రకాశ్, ప్రవీణ్ అవుతు తదితరులు పాల్గొన్నారు.  

Back to Top