ప్రకాశం జిల్లా: సంపద సృష్టిస్తాం, లక్షల ఉద్యోగాలిస్తాం, స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సృష్టించిన సంపదను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల కోసం చంద్రబాబు సంపద సృష్టిస్తున్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణలు చూస్తే మెడికల్ కాలేజీలు, కాలేజీలు, పోర్టులు, షిప్పింగ్ హార్బర్ లు, బీమా సేవలు ఇలా ప్రతీ చోటా ఇదే తంతు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్టు కృష్ణార్పణం అయిపోతోంది. 850 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 5 వేల కోట్లతో నిర్మించిన రామాయపట్నం పోర్టును సైతం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారు. పీపీవీ విధానంలో మీకు ఎలా కావాలంటే అలా ఇస్తామని చెప్తున్నారు. టెండర్ డాక్యుమెంట్లలోనే ఏటా 34.04 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో నడిచే ఈ పోర్టును అప్పగించేందుకు సిద్ధమని చెప్పేశారు. అన్ని హంగులతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని 95 శాతం పూర్తి చేశారు. టెండర్ డాక్యుమెంట్లలో సైతం డీపీఆర్ ప్రకారం రూ.4929.39 కోట్లు అంటే సుమారు 5 వేల కోట్లు అని చెప్పారు. దీన్ని రూ.1500 కోట్లు ప్రీమియం చెల్లిస్తే చాలంటున్నారు. ముందు రూ.750 కోట్లు ఇవ్వండి, కమర్షియల్ ఆపరేషన్ తర్వాత మిగిలిన రూ.750 కోట్లు ఇమ్మంటున్నారు. అదీ 30 ఏళ్లు తీసుకోండి, సరిపోకపోతే మరో 20 ఏళ్లు పొడిగించి ఇస్తామంటున్నారు. రోడ్డు, రైల్వే కనెక్టివిటీ, గోడౌన్లు, టవర్లు అన్నీ సిద్దంగా ఉన్నాయని చెప్తున్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు, ఫిషింగ్ హార్బర్ లు, పోర్టులు ఇలా ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? రుణాలు తీర్చే క్రమంలో మౌలిక సదుపాయాలు అభివృద్ది చేసినందుకు ఖర్చు చేసిన మొత్తం వసూలు చేసుకునేలా రూ.1500 కోట్లకు దీన్ని లీజుకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు ఇలా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, ఆయన కుమారుడు లోకేష్ దక్షిణ కొరియాకు వెళ్లి ఏపీలో మారిటైమ్ వ్యాపారానికి అనుకూలంగా ఉందని ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన పోర్టుల్ని ఇలా ప్రైవేటుపరం చేస్తూ ఇప్పుడు మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు తయారవుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తే, ఇప్పుడు వాటిని పప్పు బెల్లాల్లా పంచే కార్యక్రమాన్ని కూటమి సర్కార్ చేస్తుండటం సిగ్గుచేటు. మారిటైమ్ బోర్డు ఇచ్చిన డాక్యుమెంట్ కు స్పందించి లీజుకు తీసుకునే వాళ్లు ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలాంటి లీజుల్ని సమీక్షిస్తాం. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. మెడికల్ కాలేజీల సంగతి ఏమైందో అందరూ చూసారు. రామాయపట్నం పోర్టుకు కూడా అదే గతి పడుతుంది.